తమిళనాడులో అప్పుల వ్యవహారంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు పెను సంచలనంగా మారింది. అప్పు ఇవ్వడమంటే ఇకపై నిప్పుతో చెలగాటమేనని తేలిపోయింది. సాధారణంగా అవసరానికి అప్పు తీసుకునేవారు, "అన్నా, వదినా, నా నగలు తీసుకోండి, కావాలంటే నా ఇల్లు కూడా రాసిస్తా, దయచేసి కాస్త డబ్బు సాయం చేయండి" అంటూ కాళ్ల బేరానికి వస్తుంటారు.

అయితే, తీరా అప్పు చేతికి వచ్చాక, తిరిగి చెల్లించే సమయానికి మాత్రం దాతల్లా ఫోజు కొడుతున్నారనేది జగమెరిగిన సత్యం. ఇచ్చినవాడేదో దానం చేసినట్లు, తీసుకున్నవాడు ఉద్ధరించినట్లు ఫీలయ్యే విచిత్ర పరిస్థితులు సమాజంలో పెరిగిపోయాయి. దాదాపు తొంభై శాతం లావాదేవీల్లో ఇదే తంతు, ఏదో ఒక వివాదం, మనస్పర్థలు రావడం సర్వసాధారణమైపోయింది.

ఇలాంటి గొడవల్లో ప్రభుత్వాలు సాధారణంగా అప్పు తీసుకున్న ఓటర్ల పక్షానే నిలుస్తాయన్నది ఓ వాదన. చట్టపరంగానో, చట్ట వ్యతిరేకంగానో రుణదాతలపై ఒత్తిళ్లు పెంచే ఘటనలు గతంలోనూ చూశాం, కాల్ మనీ వంటి ఉదంతాలు దీనికి నిదర్శనం.

అయితే, ఇప్పుడు తమిళనాడు సర్కారు తీసుకున్న నిర్ణయం యావత్ రుణ వ్యవస్థనే తలకిందులు చేసేలా ఉంది. అప్పు తీసుకున్నవారు తిరిగి చెల్లించమని ఒత్తిడి చేస్తే చాలు, అప్పు ఇచ్చిన దాతను ఏకంగా ఐదేళ్లపాటు ఊచలు లెక్కపెట్టించేలా చట్టం తీసుకొచ్చింది. అంటే, అప్పు ఇచ్చిన వ్యక్తి, అవతలివారు దయతలచి ఇస్తే తీసుకోవాలి, లేదంటే నోరుమూసుకోవాలి. ఒకవేళ "నా డబ్బులు నాకు ఇవ్వు" అని గట్టిగా అడిగితే, అవతలి వ్యక్తి "నన్ను ఒత్తిడి చేస్తున్నారు" అని ఫిర్యాదు చేస్తే చాలు, ఇచ్చినవారినే అరెస్టు చేసి జైల్లో వేస్తారట.

ఈ కొత్త రూల్ తో, అప్పు ఇచ్చినవాడు అడిగితే నేరస్థుడు, తీసుకోనివాడు బాధితుడు. అడిగిన పాపానికి అరెస్ట్ చేసి లోపలేస్తే, ఇక ఏ దయామయుడు అప్పులివ్వడానికి సాహసిస్తాడు. ఏ బ్యాంకు రుణం ఇవ్వడానికి ముందుకొస్తుంది, ఏ ప్రైవేటు సంస్థ ధైర్యం చేస్తుంది. రాబోయే ఎన్నికల వేళ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకే ఈ విపరీత నిర్ణయమనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామంతో తమిళనాట ‘అప్పు ఇచ్చుట కంటే అడుక్కు తినుట మేలు’ అనే సామెతను నిజం చేసేలా ఉన్నారని ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద, ఈ నిర్ణయం ఆర్థిక లావాదేవీలపై తీవ్ర ప్రభావం చూపడం ఖాయంగా కనిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: