
ప్రస్తుతం రాష్ట్రంలో సుమారు 50 కి పైగా నియోజకవర్గాల్లో అధికార పక్షానికి తిరుగులేని ఆధిపత్యం ఉందన్న విషయం స్పష్టంగా కనిపిస్తోంది. వీటిలో ముఖ్యమైనవి కుప్పం, పెనుకొండ, విజయవాడ సెంట్రల్, శింగనమల, మైలవరం, గుంటూరు వెస్ట్, పొన్నూరు, తాడికొండ, విజయవాడ వెస్ట్ తదితర ప్రాంతాలు. ఈ ప్రాంతాల్లో ప్రతిపక్షం చాలా బలహీనంగా ఉంది. ఉదాహరణకు, విజయవాడ సెంట్రల్‌లో వైసీపీకి నాయకుడు ఉన్నా ఆయనకు పార్టీ లో కీలక బాధ్యతలు ఇవ్వలేదు. ఫలితంగా మల్లాది విష్ణు ప్రజల మధ్య కనిపించకపోవడంతో పాటు, ప్రజా సమస్యలపై స్వరం వినిపించడం లేదు. పైగా, తన మద్యం వ్యాపార ప్రయోజనాల పరిరక్షణపై ఎక్కువ దృష్టి సారిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి.
కుప్పం వంటి చోట్ల వైసీపీ చాలా కాలం క్రితమే పోరాటాన్ని మానేసింది. గుంటూరు వెస్ట్‌లో కూడా వైసీపీ ఉనికి దాదాపు లేనట్టే. ఈ పరిస్థితులు కేవలం ఒకటి రెండు ప్రాంతాల్లో కాకుండా అనేక నియోజకవర్గాల్లో కనిపిస్తున్నాయి. ముఖ్యంగా గత ఎన్నికల్లో అభ్యర్థులను మార్చడం, కొత్తవారిని ప్రవేశపెట్టడం వంటి రాజకీయ ప్రయోగాలు చేసిన చోట్ల ఈ బలహీనత ఎక్కువుగా కనిపిస్తోంది. ఓవరాల్‌గా రాష్ట్ర వ్యాప్తంగా 50కి పైగా నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలకే పూర్తిగా స్వేచ్ఛ లభించింది. ప్రతిపక్షం లేకపోవడం వల్ల ప్రజల ఆవేదన, సమస్యలు సరిగా వెలుగులోకి రావడం లేదు. ఈ పరిస్థితి కొనసాగితే, భవిష్యత్తులో ఆ నియోజకవర్గాలు పాలకపక్షానికి శాశ్వత కోటలుగా మారే అవకాశం ఉంది.