
వైసీపీ ప్రభుత్వానికి అభివృద్ధి అంటే తెలియదని, హత్యలు చేయడమే తెలుసని వ్యాఖ్యానిస్తూ కందికుంట చేసిన వ్యాఖ్యలు సభికుల్లో ఉత్సాహం నింపాయి. ముఖ్యంగా మాజీ ఎమ్మెల్యే, జగన్ మామ అయిన వివేకానందరెడ్డి హత్య విషయాన్ని ఆయన ప్రస్తావించటం సభలో సంచలనాన్ని రేపింది. ఆ హత్యలో ఉపయోగించిన గొడ్డలిని కదిరిలోనే కొనుగోలు చేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
పవిత్రమైన కదిరి పట్టణాన్ని వైసీపీ నాయకులు అపవిత్రం చేశారని ఆయన తీవ్రంగా దుయ్యబట్టారు. ఈ సందర్భంలో సీఎం చంద్రబాబుకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. కదిరి నియోజకవర్గానికి నీటిని వదిలి పవిత్రతను పునరుద్ధరించారని, ఆ దిశలో చంద్రబాబు చూపిన కృషి వల్లే కదిరి కొత్త ఊపిరి పీల్చుకుంటోందని అన్నారు. ఫ్యాక్షన్ చరిత్ర లేని కదిరిని కూడా వైసీపీ నాయకులు ఫ్యాక్షన్ జోన్‌గా మలచడానికి ప్రయత్నించారని, అయితే తాము ప్రజల మద్దతుతో దాన్ని తిప్పికొట్టామని కందికుంట తెలిపారు. ఇకపై కదిరిలో వైసీపీకి ఎలాంటి జాడ ఉండబోదని, వారి రాజకీయాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తామనే హామీ ఇచ్చారు. కేవలం నీటి సమస్య పరిష్కారమే కాకుండా, ఉపాధి కల్పనకు అనువుగా పరిశ్రమలను కదిరికి తీసుకువచ్చే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు. త్వరలోనే కదిరి అభివృద్ధికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ ప్రకటించనున్నట్టు ఆయన వెల్లడించారు. దాంతో కదిరి రూపురేఖలు పూర్తిగా మారతాయని, ముఖ్యంగా కదిరి లక్ష్మీనరసింహ స్వామి ఆలయాన్ని మరింత అభివృద్ధి చేసి ఆ ప్రాంతానికి కొత్త వన్నెలు తీసుకురానున్నట్టు ఆయన హామీ ఇచ్చారు.
తన ప్రసంగంలో ఎక్కడా అతిశయోక్తులకు తావివ్వకుండా, స్వల్ప సమయంలోనే బలమైన పాయింట్లను ఎత్తి చూపిన కందికుంట వెంకట ప్రసాద్ ప్రసంగం అందరిని ఆకట్టుకుంది. ఆయన ప్రసంగం పూర్తయ్యాక కూడా సభా ప్రాంగణంలో చప్పట్లు గట్టిగా మారుమోగడం, ప్రజలు నిలబడి అభినందించడం ఆయన వ్యాఖ్యలకు లభించిన స్పందనకు నిదర్శనం. కదిరి ఎమ్మెల్యే ఈ సభలో చేసిన వ్యాఖ్యలు కేవలం సభను ఉత్సాహపరచడమే కాకుండా సభలో మంచి జోష్ నింపాయి.