రాజకీయ నాయకులను నిలదీయడమే తన పని ... పాలించడానికి కాదు ప్రశ్నించడానికే పార్టీ అంటూ పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీతో వాయుసేనకు చెందిన యుద్ద విమానంలా ఎన్నికల ముందు దూసుకువచ్చాడు. బీజేపీ, టీడీపీ పొత్తుకు ఓటేయండంటూ రాష్ట్రమంతా ప్రచారం చేశాడు. సామాన్యుడికి అన్యాయం జరిగితే బీజేపీ, టీడీపీలనైనా నిలదీస్తానంటూ ప్రజలకు భరోసా ఇచ్చాడు. భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పదవి చేపట్టిన నెలరోజుల లోపే రైల్వే ఛార్జీలు ఎన్నడూ లేనంతగా 14.2 శాతం పెరిగాయి. డిజిల్, పెట్రోల్, గృహ నిర్మాణం సామగ్రి సిమెంట, ఉక్కు తదితర వస్తువుల ధరలు ఆకాశానంటాయి. దాంతో సామాన్యుడి ఇల్లు కట్టుకోలేని పరిస్థితి. కూరగాయల ధరలు మండిపోతున్నాయి. వంట గ్యాస్ ధర త్వరలో రూ.250 వరకు పెరగబోతుందంటూ ఊహాగానాలు ఊపందుకున్నాయి. మరో వైపు ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు బాధ్యతలు స్వీకరించి నెల గడిచింది. సీఎంగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రైతు రుణమాఫీ దస్త్రంపై తొలి సంతకం చేస్తానంటూ ఎన్నికల నేపథ్యంలో చంద్రబాబు హమీ ఇప్పటి వరకు అమలు కాలేదు. నేడోరేపో రుణమాఫీ చేస్తాడంటూ రైతులు కళ్లలో ఒత్తులు వేసి ఎదురు చూస్తున్నారు. అలాగే ప్రభుత్వ ఉద్యోగుల పదవి విరమణ వయస్సు 58 నుంచి 60 పెంచారు. దాంతో తమకు ఉద్యోగాలు రావంటూ రాష్ట్రంలోని నిరుద్యోగ యువత ఎంతో ఆందోళన చెందుతున్నారు. ఇంటికో ఉద్యోగం అంటూ ప్రకటించిన బాబు ఇప్పటి వరకు ఉద్యోగ ప్రకటన చేయకపోవడంతో నిరుద్యోగులు తీవ్ర వేదనతో ఉన్నారు. ఇంతమంది ఇన్ని విధాల బాధపడుతుంటే సామాన్య ప్రజల కోసమే పోరాటం... వారి కోసం జైలు ఊచలు లెక్కించడానికైనా చివరికి మరణానికైనా సిద్ధమని ఎన్నికల చెప్పిన ఈ ఆరడుగుల బుల్లెట్ సదరు నేతలను ప్రశ్నించడం లేదంటే ఆవి సమస్యలు కాదనుకున్నాడేమో. ఎన్నికల్లో బీజేపీ, టీడీపీలు విజయకేతనం ఎగురవేయడంతో ప్రజలకు మంచి రోజులు వచ్చాయని ప్రకటించిన పవన్ కల్యాణ్ ... ప్రజల సమస్యలను అటు ప్రధాని మోడీ, ఇటు చంద్రబాబుల దృష్టికి తీసుకువెళ్తానని చెప్పిన విషయాన్ని ఏదో కథలో చెప్పినట్లు ముని శాపం వల్ల మరిచిపోయి ఉండవచ్చని సామాన్యుడి నుంచి రాజకీయ విశ్లేషకులు చెవులు కొరుకుంటున్నారు. Pawan Kalyan, janasena party, janasena party president, narendra modi, prime minister, chandrababu naidu, పవన్ కల్యాణ్, జనసేన పార్టీ, జనసేన అధ్యక్షుడు, నరేంద్ర మోడీ, చంద్రబాబు నాయుడు

మరింత సమాచారం తెలుసుకోండి: