తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ది తుగ్లక్ పాలన... కేసీఆర్ ప్రవర్తన హిట్లర్ ను తలపిస్తోంది... ఈ మధ్య టీఆర్ఎస్ అధినేత పై టీడీపీ వంటి ప్రతిపక్షాలు తరచూ చేస్తున్న విమర్శలివి. వీటికి తనదైన శైలిలో కేసీఆర్ నుంచి స్పందన కోసం రాజకీయ ఆసక్తి ఉన్న వాళ్లలో ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తుగ్లక్ పాలన పై కాకపోయినా... హిట్లర్ ప్రవర్తన పై మాత్రం తెలంగాణ ప్రభుత్వాధినేత స్పందించారు. సమగ్ర సర్వే పై సందేహాలు వద్దని చెప్తూ... రాజకీయ ప్రత్యర్థులపై విమర్శల దాడి చేశారు. గత ప్రభుత్వాల పాలనతోనే ప్రస్తుత కష్టాలన్నీ అని చెప్పుకొచ్చిన కేసీఆర్... అవినీతి నిర్మూలనలో ఎవరికీ భయపడేది లేదని అన్నారు. తనను హిట్లర్ తో పోల్చడాన్ని టీఆర్ఎస్ అధినేత సమర్ధించుకున్నారు. అవినీతి, అక్రమాల పై నేను హిట్లర్‌ని కాదు.. హిట్లర్ తాతను కూడా... అని గట్టిగా చెప్పారు. ఎవరికీ భయపడే ప్రసక్తే లేదు. తప్పుడు పనులు చేసి ప్రజాధనాన్ని దోచుకునే వారిపట్ల హిట్లర్‌గానే వ్యవహరిస్తానని కుండ బద్దలు కొట్టారు. అన్యాయం అరికట్టడానికి ఎంతకైనా తెగిస్తానని అన్నారు. ఎవరో ఏదో అన్నారని తాను భయపడనని... మంచి కోసం సర్వే చేస్తే తప్పేంటని ప్రశ్నించారు. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఓ సన్నాసి నోరుపెద్దగా చేసుకుని మాట్లాడుతున్నారని, అలా మాట్లాడడానికి సిగ్గుండాలనీ తెలంగాణ సీఎం తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హైదరాబాద్‌ను నేనే నిర్మించానని చెప్తున్న వ్యక్తి విజ్ఞతకే దానిని వదిలేస్తున్నా అని చంద్రబాబుకు చురకంటించారు. సకల జన సర్వే నేపథ్యంలో ప్రతిపక్షాలు వ్యక్తం చేస్తున్న అనుమానాల పైనా కేసీఆర్ స్పందించారు. నిజమైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించేందుకే సర్వే చేపడుతున్నామని చెప్పారు. అయితే కిషన్‌రెడ్డి, తెలుగుదేశం పార్టీ చిలువలు పలువలు చేసి ప్రచారం చేస్తున్నాయని విమర్శించారు. ప్రభుత్వాన్ని, కేసీఆర్‌ను విమర్శిస్తే జోకర్లు అవుతారని కేసీఆర్ ఎద్దేవా చేశారు. సర్వేకు స్థానికతకు సంబంధం లేదని, 1956 కంటే ముందున్నవారికే స్థానికత వర్తిస్తుందని ఇంతకుముందే ఉత్తర్వులు జారీచేశామని గుర్తు చేశారు. గుడ్డుపై ఈకలు పీకే కొందరు నేతలు... మూడు నెలలకే ప్రభుత్వంపై అక్కసు పెంచుకుని బట్టలు చించుకుంటున్నారని వ్యంగాస్త్రాలు సంధించారు. సర్వేలో బ్యాంక్ అకౌంట్ తప్పనిసరిగా చెప్పాల్సిన అవసరం లేదన్న కేసీఆర్... చెబితే ప్రభుత్వ పథకాల డబ్బు నేరుగా మీ అకౌంట్లకే వస్తుందని వివరించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: