ధూళిపాళ సీతారామ శాస్త్రి (సెప్టెంబర్ 24, 1922 - ఏప్రిల్ 13, 2007) తెలుగు నాటక రంగంలో, తెలుగు సినీ రంగంలోనూ తన నటనా ప్రతిభతో విశేషంగా రాణించారు.  తెలుగు నాటక, చలన చిత్ర రంగాల్లో అసమాన నటుడిగా పేరుతెచ్చుకుని, జీవిత చరమాంకాన్ని శ్రీరామ సేవకే అంకితం చేసిన మహా మనిషి ధూళిపాళ సీతారామ శాస్త్రి. ధూళిపాళ పేరుచెప్పగానే ఆయన నటించిన ‘శకుని’ పాత్రే కళ్లముందు మెదులుతుంది. ఆ పాత్రకు అంతవరకు సి.ఎస్‌.ఆర్‌, లింగమూర్తి వంటివారు న్యాయం చేయగా, ధూళిపాళ ప్రత్యేక తరహా వాచకం, హావభావాలతో వారి సరనస చేశారు. గుంటూరు జిల్లా పల్నాడు మండలం దాచేపల్లిలో 1922 సెప్టెంబర్ 24 న జన్మిచాడు. 2001లో సన్యాస ఆశ్రమం స్వీకరించి శ్రీ  మారుతీ సేవేంద్ర సరస్వతిగా మారిపొయాడు.



చిన్నప్పటి నుంచి రంగస్థల ప్రదర్శన పట్ల ధూళిపాళ ఎంతో మక్కువ చూపేవారు. బతుకుతెరువు కోసం గుంటూరులో కొద్దికాలం ప్లీడర్‌ గుమాస్తాగా పనిచేశారు. 1935లో స్త్రీ పాత్ర ద్వారా నాటకరంగ ప్రవేశం చేశారు. 1941లో గుంటూరులో స్టార్‌ థియేటర్‌ను స్థాపించి నాటక ప్రదర్శనలు ఇస్తుండేవారు. ఆయన రంగస్థలం మీద పోషించిన ధుర్యోదన, కీచక పాత్రలకు మంచి ప్రశంసలు లభిస్తుండేవి. 1959లో మద్రాసు పచ్చయప్ప కాలేజీలో నాటక పోటీలలో రోషనార నాటకంలోని రామసింహుడు పాత్రను పోషించాడు. పోటీల న్యాయనిర్ణేతల్లో ఒకరైన జి.వరలక్ష్మి దృష్టిని ఆయన ఆకర్షించారు. సినిమాల్లో నటించమని ఆమె సూచించడమే గాకుండా దర్శకుడు బి.ఎ.సుబ్బారావుకు పరిచయం కూడా చేశారు.


దాంతో బి.ఎ.సుబ్బారావు గారు భీష్మ (1962) చిత్రంలో ధూళిపాళకు ధుర్యోధనుడి పాత్రను ఇచ్చారు. ఆ సినిమాలో భీష్ముడిగా యన్‌.టి.రామారావు నటించారు. ధూళిపాళలోని నటనా ప్రతిభను మెచ్చుకున్న ఎన్‌.టి.రామారావు గారు తర్వాత తన బ్యానర్‌లో నిర్మించిన శ్రీ కృష్ణ పాండవీయంలో శకుని పాత్రను ధూళిపాళకు ఇచ్చారు. ఆ పాత్ర ధూళిపాళ కెరీర్‌లోనే మైలురాయిగా నిలిచింది. ఆ తర్వాత గయుడు, రావణుడు, మైరావణుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు ఆయన పోషించారు. సాంఘిక చిత్రాల్లో సైతం సాత్విక, దుష్ట పాత్రలు పోషించి అందరినీ మెప్పించారు. దానవీరశూరకర్ణ, కథానాయకుడు, ఆత్మ గౌరవం, ఉండమ్మా బొట్టుపెడతా వంటి ఎన్నో చిత్రాల్లో ఆయన నటించారు. చూడాలని ఉంది, శ్రీ ఆంజనేయం, మురారి వంటివి ఆయన ఆఖరి చిత్రాలు.

మరింత సమాచారం తెలుసుకోండి: