
మలక్ పేట మూసారాంబాగ్ చెందిన శకుంతలా బాయి(90)కి ఇద్దరు కుమారులు, నలుగురు కుమార్తెలు సంతానం. చాలా కాలం క్రితమే శకుంతలా బాయి భర్త చనిపోయారు. అప్పటినుంచి తన నివాసంలో ఇద్దరు కొడుకులతో కలిసి ఉంటుంది. ఒంట్లో ఓపిక ఉన్నంతకాలం కొడుకుల కోసం ఆమె ఎంతో కష్టపడింది. ఇప్పుడు శకుంతలా బాయి వయసు 90 సంవత్సరాలు. తన పనులు తాను చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్న ఆమెను దగ్గరుండి చూసుకోవడానికి కొడుకులు నిరాకరించారు. నిర్ధాక్షణ్యంగా తల్లిని ఇంటి నుంచి బయటకు వెళ్ళగొట్టారు.
కన్నకొడుకులే ఇంత దారుణంగా ప్రవర్తించడంతో ఆ తల్లి గుండె నిండా బాధతో కన్నీరు మున్నీరైంది. సైదాబాద్ లో తన చిన్న కూతురు ఇంటి వద్ద ఉంటూ కొడుకులపై పోరాటానికి దిగింది. ముదిమి వయసులో తన బాగోగులు చూడని కొడుకులు తన ఇంట్లో ఉండేందుకు వీల్లేదని.. తన ఇంటిని తనకు అప్పగించేలా చూడాలని శకుంతలాబాయి హైదరాబాద్ జిల్లా రెవెన్యూ ఆఫీసర్‌కు 2024 ఫిబ్రవరిలో ఫిర్యాదు చేసింది. ఆర్టీవో అధికారులు ఆమె కొడుకులను పిలిచి కౌన్సింగ్ ఇవ్వడమే కాక.. ఇంటిని తల్లికి అప్పగించాలని ఆదేశాలు జారీ చేశారు. దానికి సరే అన్నారు కానీ.. నెలలు గడుస్తున్నా ఇంటిని ఖాళీ చేయలేదు. దాంతో శకుంతలాబాయి మరోసారి ఫిర్యాదు చేయగా.. సైదాబాద్ తహశీల్దార్ జయశ్రీ మూడు రోజుల క్రితం బాధితురాలి కొడుకులకు ఫైనల్ నోటీస్ జారీ చేశారు. అయిన కూడా ఇంటిని ఖాళీ చేయకపోవడంతో.. స్వయంగా తహశీల్దార్ రంగంలోకి దిగారు. అప్పటికే కొడుకులు ఇంటికి తాళం వేసి వెళ్లిపోగా.. రెవెన్యూ సిబ్బంది ఆ ఇంటిని సీజ్ చేసి వారికి సరైన గుణపాఠం చెప్పారు.