భయం అనేది ఎవరికైనా వారి బలహీనతే అవుతుంది. మన బలం మనల్ని ముందుకు నడిపి విజయాన్ని అందిస్తే...మన బలహీనత మనకు అదే విజయాన్ని దూరం చేస్తుంది. అయితే తన బలహీనతను కూడా బలంగా మార్చుకుని ముందుకు నడిచేవాడే విజయ శిఖరాన్ని అధిరోహించగలడు. దీనికి చిన్న కథ ఉంది అదేమిటంటే. ఒక వ్యక్తికి రకరకాల ప్రదేశాలను సందర్శించడం అంటే చాలా ఇష్టం. కానీ అతడికి నీళ్ళు అంటే మాత్రం చాలా భయం. చాలా ప్రదేశాలకు వెళ్ళి ప్రపంచాన్నే చుట్టేయాలన్న ఆలోచనలతో వరల్డ్ టూర్ ప్లాన్ చేసాడు. అలా ప్రపంచాన్నే ఓ రౌండ్ వెయ్యాలని బయలుదేరిన అతడు ఎన్నో చోట్లకి వెళ్ళాడు. ఎన్నెన్నో ప్రదేశాలు తిరుగుతూ ఒకరోజు ఒక నదిని దాటాల్సి వచ్చింది. 

ఎందుకో తెలియదు కానీ అతడికి నీటిని చూస్తేనే భయం. అయినా ప్రపంచాన్నే తిరిగి రావాలన్న అతడి సంకల్పం ముందుకు సాగాలి అంటే  ఆ నదిని దాటక తప్పదని తలచి నదిని దాటేందుకు దైర్యం చేశాడు. పడవలో కూర్చొని ప్రయాణం కొనసాగించాడు. ఇంతలో ఊహించని సమస్య అతడిని ప్రమాదంలోకి నెట్టేసింది. హఠాత్తుగా ఆ పడవ ఒక పెద్ద బండకు తగిలి నీటిలో మునిగిపో సాగింది. దగ్గర్లోనే ఒడ్డు కనిపిస్తోంది కానీ అక్కడికి చేరాలంటే ముందుకు సాగాల్సిందే.  ఆ సమయంలో అతడి ముందు రెండే ఆప్షన్లు..ఒకటి నీటిపై అతడి పూర్తి భయాన్ని వీడి ముందుకు వెళ్లి ఒడ్డుకు చేరుకోవాలి, లేదా ఆ భయంతోనే నీటిలో మునోగిపోవాల్సి వస్తుంది. అతడు అప్పుడు తన భయాన్ని పూర్తిగా విడిచి పెట్టి ఈత కొట్టడం మొదలు పెట్టాడు.. చివరికి ఒడ్డుకు చేరుకున్నాడు.

అలా తన నీటి భయం అనే బలహీనతను పోగొట్టుకొని దైర్యం చేశాడు. అలా బయట పడిన అతను ప్రపంచాన్ని పూర్తిగా తిరిగి చివరికి తన కలను నెరవేర్చుకున్నాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది మన లక్ష్యాన్ని ప్రాణంగా భావిస్తే  మార్గ మధ్యంలో ఎన్ని అవాంతరాలు ఎదురైనా మనో దైర్యంతో వాటిని అధిగమించి  విజయాన్ని అందుకోగలం. లేదా ఆ సమస్యలకు భయపడి వెనకడుగు వేస్తే ప్రయాణం అక్కడే ఆగిపోతుంది. వీటిలో ఏది ఎంచుకోవాలన్నది మన చేతిలోనే ఉంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: