ఆయుష్‌ కార్యదర్శి వైద్య రాజేశ్‌ కొటెచ్చాపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే నేత, ఎంపీ కనిమొళి డిమాండ్‌ చేశారు. హిందీ మాట్లాడడం రాని వారు శిక్షణ కార్యక్రమం నుంచి బయటకు వెళ్లాలని ఆయన సూచించినందుకు ఆయనపై క్రమ శిక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. ఈ మేరకు ఆయుష్‌ మంత్రి శ్రీపాద్‌ నాయక్‌కు ఆమె లేఖ రాశారు.

ఆయుష్‌ మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన వర్చువల్‌ శిక్షణా కార్యక్రమం ఈ వివాదానికి వేదికైంది. దీనికి హాజరైనవారిలో హిందీ మాట్లాడడం రాని, అర్థం చేసుకోలేని యోగా టీచర్లు, మెడికల్‌ ప్రాక్టీషనర్లు కార్యక్రమం నుంచి వైదొలగాలంటూ ఆయుష్‌ కార్యదర్శి వ్యాఖ్యానించారు. ఈ శిక్షణకు తమిళనాడు నుంచి పలువురు హాజరయ్యారు.


దీనికి సంబంధించిన వీడియో ఒకటి బయటకు రావడంతో కనిమొళి స్పందించారు. ఇంకెంతకాలం ఇలాంటి వివక్ష అని ప్రశ్నించారు. హిందీని బలవంతంగా రుద్దే ప్రయత్నం మానుకోవాలని ట్వీట్‌ చేశారు. ఆయుష్‌ కార్యదర్శిపై చర్యలు తీసుకోవాలంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌ కూడా డిమాండ్‌ చేశారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ప్రధాని కార్యాలయాన్ని జోడిస్తూ ట్వీట్‌ చేశారు. కాంగ్రెస్‌ ఎంపీ, చిదంబరం తనయుడు కార్తీ చిదంబరం కూడా దీన్ని ఖండించారు.



మరింత సమాచారం తెలుసుకోండి: