
అక్షరాలా ఐదు వేల చీమలు. అవి కూడా మామూలు చీమలు కాదు.. క్వీన్ యాంట్స్ అట.. రాణి చీమలు. వాటి విలువ తెలిస్తే కళ్ళు తేలేస్తారు. ఒక్కో చీమ ధర అక్షరాలా 130 డాలర్లు. మన కరెన్సీలో సుమారు పదకొండు వేల రూపాయలు పైమాటే. ఇంతకీ ఈ చీమల దందాలో పట్టుబడ్డ వాళ్లెవరో తెలుసా, ఇద్దరు బెల్జియం టీనేజర్లు, ఒక వియత్నాం దేశస్థుడు, ఇంకొక కెన్యా కుర్రాడు.
వీళ్లంతా కలిసి లేక్ నైవాషా దగ్గర ఒక గెస్ట్ హౌస్‌లో మకాం వేశారు. అక్కడే పోలీసులు రైడ్ చేసి ఈ వింత స్మగ్లింగ్‌ను వెలికి తీశారు. చూడ్డానికి టెస్ట్ ట్యూబ్‌లు, సిరంజ్‌ల్లాంటి చిన్న చిన్న కంటైనర్లలో ఈ చీమల్ని పెట్టి, నెలల తరబడి బతికుండేలా ప్లాన్ వేశారు. అంటే ఎంత పక్కా స్కెచ్ వేశారో అర్థం చేసుకోవచ్చు.
సాధారణంగా వన్యప్రాణుల స్మగ్లింగ్ అంటే ఏనుగు దంతాలు, పులి చర్మాలు, ఖడ్గమృగం కొమ్ములు లాంటివి గుర్తొస్తాయి. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. చిన్న జీవులను కూడా వదలడం లేదు స్మగ్లర్లు. జపాన్ నుంచి స్నాక్స్ ప్యాకెట్లలో బీటిల్స్‌ను పట్టుకున్నారు, అమెరికా పోర్టుల్లో పగడపు దిబ్బలు దొరుకుతున్నాయి. ఇప్పుడు ఏకంగా చీమల స్మగ్లింగ్ వెలుగులోకి రావడం చూస్తే, వన్యప్రాణుల అక్రమ రవాణా ఏ స్థాయిలో విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.
ఈ ఘటనపై కెన్యా వైల్డ్‌లైఫ్ సర్వీస్ సీరియస్‌గా స్పందించింది. ఇది బయోపైరసీ అని, దేశ సంపదను దోచుకోవడమేనని మండిపడింది. అంతేకాదు, ఈ చీమల వల్ల స్థానిక ప్రజలకు, పరిశోధనా సంస్థలకు ఎంతో ఉపయోగం ఉంటుందని, వాటిని అక్రమంగా తరలించడం దేశానికి తీరని నష్టం అని ఆవేదన వ్యక్తం చేసింది. ప్రస్తుతం ఈ కేసు విచారణ జరుగుతోంది.
అసలు ఈ చీమలకు ఇంత డిమాండ్ ఎందుకు? వీటిని ఏం చేస్తారు? ఈ స్మగ్లింగ్ వెనుక అసలు సూత్రధారులు ఎవరు? అనే ప్రశ్నలకు సమాధానం కోసం పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ చీమల దందా వెనుక పెద్ద నెట్‌వర్కే ఉందని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో ఈ కేసులో ఇంకెన్ని సంచలన విషయాలు వెలుగులోకి వస్తాయో చూడాలి.