
తెలంగాణ వారి చెక్ పోస్టులను కూడా మన భూభాగంలో పెట్టారని... మన వాళ్ళు డ్యామ్ మీదకు వెళ్ళాలన్నా తెలంగాణ వారి పర్మిషన్ తీసుకోవాల్సిన పరిస్థితిని చంద్రబాబు తెచ్చారని మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. దీనిని మార్చేందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చిత్తశుద్ధితో చర్య తీసుకుని సాధించామని.. మంత్రి అంబటి రాంబాబు అన్నారు. గతంలో 2015 ఫిబ్రవరి 13న చంద్రబాబు హయాంలో.. సాగర్ నీటిని విడుదల చేయటానికి మన అధికారులను పంపితే.. విడుదల చేయటానికి వీల్లేదని తెలంగాణ వారు అభ్యంతరం పెట్టారని... దాంతో రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య పెద్ద గొడవ జరిగిందని.. సాగర్ గరం.. గరం.. నీటి యుద్ధం అంటూ పత్రికల్లో వార్తలు కూడా వచ్చాయని అంబటి గుర్తు చేశారు.
చివరికి గవర్నర్ దగ్గర మొరపెట్టుకుని, తెలంగాణ వారి దయాదాక్షిణ్యాలతో నీరు విడుదల చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందని.. మన నీటిని మనం విడుదల చేసుకోవాలంటే.. తెలంగాణ వారి పర్మిషన్ అవసరమా అని మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నించారు. మన రాష్ట్ర ప్రజల అవసరాల నిమిత్తం.. 2000 క్యూసెక్కుల నీటిని సాగర్ నుంచి మొన్న విడుదల చేశామని.. దీనిమీద కొంతమంది దుర్మార్గంగా మాట్లాడుతున్నారని.. వాస్తవాలేమిటో ప్రజలు అర్థం చేసుకోవాలని మంత్రి అంబటి రాంబాబు సూచించారు. కృష్ణా వాటర్ లో మా వాటాకు మించి ఒక్క బొట్టును కూడా మేము వాడుకోబోమని.. మా వాటా ప్రకారం వాడుకుంటామని... మన వాటా నీటిని వాడుకునేందుకు స్వేచ్ఛ మాకు కావాలని... మా నీటిని మేము వాడుకోవాలని మంత్రి అంబటి రాంబాబు అన్నారు.