ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ చాలా రోజుల తర్వాత తన ధోరణికి భిన్నంగా వ్యవహరించారు. ఉద్యోగుల అంశంపై నిన్న మొన్నటి వరకూ పట్టుదలగా ఉన్న సీఎం జగన్ ఇప్పడు.. సమస్యను ఏదో రకంగా పరిష్కరించాలని తన మంత్రులకు సూచించారు. దీంతో పీఆర్సీకి వ్యతిరేకంగా నిరసన తెలుపుతున్న ఉద్యోగ సంఘాలను ఏపీ ప్రభుత్వం మరోసారి చర్చలకు పిలిచింది. శనివారం నుంచి  ఉద్యోగుల సహాయ నిరాకరణకు పిలుపు ఇచ్చారు. ఈ నేపథ్యంలో చర్చలు జరిపి సమస్యను పరిష్కరించాలని జగన్ తలచారు.


గురువారం నాటి చలో విజయవాడ సక్సస్‌ఫుల్ కావడంతో.. జగన్ సర్కారు దిగివచ్చినట్టే భావించాలి. చలో విజయవాడ కార్యక్రమం తరహాలోనే సమ్మె కూడా విజయవంతం అయితే.. అప్పుడు ప్రభుత్వం పరువు పూర్తిగా పోతుందని జగన్ సర్కారు భయపడిందా.. లేక ఎందుకొచ్చిన గొడవ ఇష్యూను క్లియర్ చేద్దామని భావించిందా తెలియదు కానీ.. మొత్తానికి చలో విజయవాడ ద్వారా ప్రభుత్వంలో మాత్రం కదలిక వచ్చింది.


ఉద్యోగులతోచర్చించే బాధ్యతను మంత్రులు బుగ్గన రాజేంద్రనాథ్, బొత్స సత్యనారాయణ, పేర్ని నాని, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిలకు అప్పగించారు. ఉద్యోగులతో సమగ్రంగా చర్చించి.. సమ్మెను విరమింపజేయాలని సీఎం జగన్‌ మంత్రులు, సజ్జలకు సూచించారు. దీంతో పీఆర్సీ సాధన సమితి నేతలతో ఈ కమిటీ భేటీ అయ్యింది. వీరితో పాటు సీఎస్ సహా పలువురు అధికారులు భేటీ అయ్యారు.


ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపిన మంత్రులు, సజ్జల... హెచ్ ఆర్ ఏ స్లాబ్ లలో మార్పులకు సంసిద్ధత వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. అలాగే అదనపు క్వాంటం పెన్షన్  తదితర అంశాల్లోనూ మార్పులు చేసేందుకు మంత్రులు ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. ఇంకా సీపీఎస్ రద్దు అంశంపై మరో మంత్రివర్గ ఉప సంఘం చర్చలు జరుపుతోంది కాబట్టి.. మరింత సమయం కావాలని మంత్రులు కోరారు. మొత్తానికి ఈ సమస్యను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని జగన్ భావిస్తున్నారు. మంచి పరిణామమే.


మరింత సమాచారం తెలుసుకోండి: