విశాఖ ఉక్కు కొనుగోలు కోసం టాటా కంపెనీ ఆసక్తి కనబరిచిందంటూ వార్తలు చక్కర్లు కొట్టాయి. అవును, మాకు ఆ ఇంట్రస్ట్ ఉంది అంటూ టాటా స్టీల్ సీఈవో కమ్ మేనేజింగ్ డైరెక్టర్ టీవీ నరేంద్రన్ కూడా క్లారిటీ ఇచ్చారు. సడన్ గా టాటాలు ఈ వ్యవహారంలో ఎందుకు ఎంట్రీ ఇచ్చారు. అసలేంటి కథ..? విశాఖ స్టీల్ ప్రైవేటీకరణ వ్యవహారంలో తలనొప్పి కొనితెచ్చుకున్న కేంద్రం, టాటా కంపెనీని ఎలా తెరపైకి తెచ్చింది. దీనికి వెనక పెద్ద వ్యవహారమే నడిచిందని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.

టాటా స్టీల్ కంపెనీకి 113 ఏళ్ల చరిత్ర ఉంది. జంషెడ్ పూర్ లో, టాటా స్టీల్ ఏర్పడినప్పటినుంచి ఇప్పటి వరకు దాన్ని సక్సెస్ ఫుల్ గా నడుపుతూ వచ్చారు. ఆ తర్వాత స్వతంత్ర భారతంలో చాలా కంపెనీలు ఏర్పడినా టాటా మాత్రం తన ఉనికి కాపాడుకుంటూ వస్తోంది. ఈ క్రమంలో పలు విదేశీ కంపెనీలను కూడా టాటా గ్రూపు టేకోవర్ చేయడం, వాటిని కూడా లాభాలబాట పట్టించడం అందరికీ తెలిసిందే. అయితే ఆసక్తికర విషయం ఏంటంటే.. ఇటీల కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, టాటా కంపెనీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మీలాంటి సంస్థ విదేశీ కంపెనీలను కొనుగోలు చేసి ఉండొచ్చు, అయితే వాటి ప్రాధాన్యం దేశ ప్రయోజనాలకంటే ఎక్కువయిందా అంటూ వ్యాఖ్యానించారు వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్. అది జరిగిన కొన్ని రోజుల్లోనే టాటా కంపెనీ, వైజాగ్ స్టీల్ ని కొనుగోలు చేసేందుకు తమకు ఆసక్తి ఉందంటూ చెప్పేసింది.

పీయూష్ గోయల్ వ్యాఖ్యలకు, టాటా నిర్ణయానికి సంబంధం ఉందని చెప్పలేం కానీ, టాటా ఎంట్రీతో వైజాగ్ స్టీల్ ఉద్యోగుల ఆందోళన కొంతమేర తగ్గొచ్చనే అంచనాలున్నాయి. వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణకు ఉద్యోగులు ఒప్పుకోవడంలేదు. రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం చేసి, కేంద్రానికి పంపింది. ఈ క్రమంలో వైజాగ్ స్టీల్ ప్రైవేటీకరణ అంశం ఏపీలో బీజేపీకి ప్రతికూలంగా మారే ఛాన్స్ కూడా ఉంది. అందుకే టాటాలను తెరపైకి తెచ్చారనే అనుమానాలు కూడా ఉన్నాయి. విదేశీ కంపెనీలకో లేదా, బీజేపీ నాయకులకు సన్నిహితులు ఉన్న గుజరాత్ కంపెనీలకో వైజాగ్ స్టీల్ ని అప్పగించకుండా టాటా కంపెనీకు అమ్మేస్తే కొంతలో కొంత సానుకూలత ఉంటుందని బీజేపీ భావిస్తోంది. అందుకే ఈ ప్రతిపాదనకు సంబంధించిన వార్తలు బయటకు వచ్చినట్టు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: