
మే నెలలో సుప్రీంకోర్టు తీర్పు మేరకు ఏబీ వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ ను ఎత్తివేశారు. మే 19 తేదీన ఏబీ వెంకటేశ్వరరావు సాధారణ పరిపాలన శాఖకు రిపోర్టు కూడా చేశారు. అప్పటి నుంచి ఏబీ వెంకటేశ్వరరావును జగన్ సర్కారు వెయిటింగ్ లో ఉంచింది. ఇప్పుడు ఎట్టకేలకు ఏబీ వెంకటేశ్వరరావుకు పోస్టింగ్ ఇస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. అయితే ఈ ఏబీ వెంకటేశ్వరరావు అంశం కారణంగా ఐపీఎస్, ఐఏఎస్‌ల పోస్టింగుల విషయం మరోసారి చర్చకు వచ్చింది.
ఐఏఎస్, ఐపీఎస్ అంటే దేశంలోనే అత్యున్నత స్థాయి అధికారులు. రాజకీయ నాయకులు మారుతుంటారు.. కానీ ఒక్కసారి ఐఏఎస్, ఐపీఎస్ అయితే.. సర్వీస్ దిగిపోయేవరకూ వారికి ఆ ప్రాధాన్యం ఉంటుంది. కానీ.. ఇప్పుడు రాజకీయ నాయకుల జోక్యం పుణ్యమా అని ఆ అధికారుల పోస్టింగుల్లోనూ రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. దీనికి తగ్గట్టు ఒకప్పుడు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు నీతి, నిజాయితీలకు మారు పేరుగా ఉండేవారు.
ఇప్పుడు చాలా మంది మంచి పోస్టింగుల కోసం అధికారంలో ఉన్న నాయకుల అడుగులకు మడుగులు వత్తుతున్నారు. మరికొందరు ఏకంగా పార్టీ కార్యకర్తల స్థాయికి దిగజారుతున్నారు. ఏబీ వెంకటేశ్వరరావు చంద్రబాబు హయాంలో టీడీపీ కార్యకర్తలా పని చేశారన్న అపవాదు ఉంది. ఇప్పుడు ఆ కక్ష కారణంగానే జగన్ సర్కారు కూడా ఆయన్ను వేధిస్తోందన్న వాదన ఉంది. ఏదేమైనా ఏబీ వెంకటేశ్వరరావు విషయంతో ముఖ్యమంత్రులు, ఐఏఎస్, ఐపీఎస్‌ల బంధాలు మరోసారి చర్చకు వచ్చాయి.