ఏపీలో రాజకీయ వాతావరణం రోజురోజుకు ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే రెండు జాబితాలతో జనసేన, బీజేపీ, టీడీపీ కూటమి అభ్యర్థులను ప్రకటించింది. ఈ జాబితా నేపథ్యంలో అధికార వైసీపీ అభ్యర్థులను ఎప్పుడు ప్రకటిస్తుంది అనే  ఆసక్తి నిన్న మొన్నటి వరకూ అందరిలో నెలకొంది. చాలామంది జగన్ ప్రకటించే జాబితా కోసం ఆత్రుతగా ఎదురు చూశారు. అయితే వారందరి ఎదురు చూపులకు తెర దించుతూ ఇటీవల జగన్ పొటీ చేసే అభ్యర్థుల జాబితాను విడుదల చేశారు.


కాకపోతే ఈ సారి జాబితాలో జగన్ కాస్త వైవిధ్యాన్ని ప్రదర్శించారు. వాస్తవానికి గత కొద్ది నెలలుగా సర్వే పేరుతో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చారు. ఎన్నికల్లో చాలా మందికి టికెట్ ఇవ్వలేదు. అదే సంప్రదాయాన్ని అభ్యర్థుల జాబితాలో ప్రదర్శించారు. ముఖ్యంగా ఏపీలోని కీలకమైన నారా లోకేశ్, నందమూరి బాలకృష్ణ, జనసేన అధినేత పవన్ కల్యాణ్ లపై మహిళా అభ్యర్థులను జగన్ నిలబెట్టారు.


దీంతో ఏపీలో చర్చ మొదలైంది. పవన్ కల్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో వైసీపీ తరఫున వంగ గీతను అభ్యర్థిగా ప్రకటించారు. ఇక్కడ ముద్రగడ ను బరిలో దింపుతారని భావించినా.. వంగ గీత వైపే మొగ్గు చూపారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ పోటీ చేస్తున్న మంగళగిరిలో లావణ్యను పోటీకి ఉంచారు. గత ఎన్నికల్లో ఆళ్ల రామకృష్ణారెడ్డిని బరిలో ఉంచగా.. ఈ సారి ఆయన్ను మార్చి తొలుత గంజి శ్రీనివాస్ ను అభ్యర్థిగా ప్రకటించారు. మళ్లీ మార్పులు చేసి లావణ్యను బరిలో ఉంచారు.


గత ఎన్నికల్లో హిందూపురం నుంచి వైసీపీ అభ్యర్థిగా ఇక్బాల్ హుస్సేన్ పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో బాలకృష్ణ విజయం సాధించారు. గత ఎన్నికల్లో పిఠాపురం నుంచి పెండెం దొరబాబు గెలుపొందగా.. ఈ సారి సర్వేలు అనుకూలంగా లేకపోవడంతో జగన్ ఆయన్ను మార్చారు. ఇటు పవన్ పై వంగా గీత, నారా లోకేశ్ పై లావణ్య, బాలకృష్ణపై దీపికను పోటీలో పెట్టి జగన్ సరికొత్త రాజకీయానికి తెరలేపారు. వీరంతా రాజకీయ పలుకుబడి లేని సామాన్య మహిళలే కావడం విశేషం. తద్వారా గెలిచినా.. ఓడినా సామాన్య అనే అంశం తెరపైకి వస్తుంది. తద్వారా వారికి చెక్ పెట్టినట్లవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: