ఆలేరుకు 20 కి.మీ.ల దూరంలో వున్న మండలకేంద్రం రాజపేట. యాదాద్రి-భువనగరి, సిద్ధిపేట,మెదక్ జిల్లాల సరిహద్దులో వుంది రాజపేట. రాజపేట గ్రామం కోటలోపలనే వుంది.52 ఎకరాలలో మొత్తం కోట,ఊరు విస్తరించివున్నాయి. ఇట్లాంటి గడికోట తెలంగాణాలో మరెక్కడా కనిపించదు. కొత్తగా గ్రామం కోట బయటకూడా విస్తరించింది. మొత్తం 2000లకు పైగా ఇండ్లున్నాయి. ఈ కోట 12మీ.ల ఎత్తు, 3మీ.ల వెడల్పులు కలిగివుంది. కోట చుట్టూ లోతైన కందకం తవ్వి వుంది.కోట బయటవున్న గోపాలచెరువు నీళ్ళు ఈకందకంలోనికి పారేటట్లు కాలువతీసి వుంది.కోట ద్వారాలకు రెండువైపుల బురుజులు కట్టబడివున్నాయి. కోటలోపల పడమటివైపు రాజభవనం నిర్మించబడివుంది. దీన్ని అద్దాలమేడ అని పిలుస్తారు. అంతఃపురం అవసరాలకు తవ్వించిన పెద్దబావి వుంది. దాన్ని ‘ఏనుగుల భావి’ అని పిలుస్తారు. భవనంలోపల ఒకవైపు శివాలయం వుంది. రాజభవనానికివున్న 5బురుజులు కూలి, శిథిలమైపోతున్నాయి. రాజభవనం ముందరున్న ఫౌంటెన్ శిథిలజ్ఞాపకంగా మిగిలిపోయివుంది.
   రాయన్న అనేరాజు కోట నిర్మాణానికి తగిన ప్రదేశాన్ని వెతుకుతూ వచ్చి ఆలేరు వాగుకు తూర్పున వున్న గుండ్లగూడెంలో కొంతమేరకు కోటనిర్మాణం చేసాడు. కోటనడుమ శివాలయాన్ని కట్టించాడు. కాని, ఎందుకో అక్కణ్ణించి రాజపేట ప్రాంతానికి వచ్చి విజ్ఞుల సలహాతో ఇక్కడే కోట నిర్మాణం చేసాడంటారు.


              ఈ కోటను వెదిరె వంశం వారు నిర్మించారు. నిజాం పాలనాకాలంలో(క్రీ.శ. 1724-1948) నిజాంరాజులు తమకిష్టమైన ప్రభుభక్తిపరులకు జాగీర్లు, సంస్థానాలు, పాయెగాలు ఇచ్చేవారు.నిజాం రాష్ట్రంలో 14 సంస్థానాలుండేవి. వాటిలో రాజపేట ఒకటి. మంచి ఆదాయంవున్న సంస్థానాలకు స్వయంపాలనాధికారాలుండేవి. అటువంటి హక్కులులేని సంస్థానం రాజపేట. ఈ సంస్థానం పరిధిలో 9గ్రామాలుః రాజపేట, కుర్రారం, నమిలె, మాసాయిపేట, కోరుకొండ, పెద్దపాడు, సాధువెల్లి, చల్లూరు, వెంకిర్యాల వుండేవి. సంస్థానాధీశులు ప్రజలతో వెట్టిచాకిరి చేయించుకునేవారు. నిజాం రాజుకు పంపే నజరానాకు కావలసినవన్నింటిని వెట్టివాండ్లైన హరిజనులు మోసుకుంటు కాలినడకన పోయి హైదరాబాదులో ఇచ్చి వచ్చేవారట. అట్లాంటి సేవలు చేసే వారికి నిజాం ‘బలోతా ఇనాం’(పన్ను కట్టనవసరంలేనిది) యిచ్చేవాడట.
 క్రీ.శ.1775లో ‘రాజా రాయన్న’ రాజాపేట గ్రామాన్ని దుర్గాన్ని నిర్మించినట్లు తెలుస్తున్నది. రాజపేట పూర్వనామం రాయన్నపేట. రాయన్నతర్వాత అతని కుమారుడు రాజా  వెదిరె వెంకటనారాయణరావు బహద్దూరు రాజ్యాధికారం చేపట్టాడు.కావడానికి వీరు రెడ్డిదొరలే అయినా వీళ్ళకు నిజాం యిచ్చిన బిరుదు ‘రావు బహద్దూరు’వల్ల తమ పేరు తర్వాత రావు అని పెట్టుకునేవారు. ఈ నారాయణరావే తనపేరుతో నారాయణపురం సంస్థానాన్ని నిర్మించాడని తెలుస్తున్నది. తనకు సంతానంలేని కారణం చేత రాజపేట తనసోదరుని కుమారుడైన రామేశ్వర చందర్ ని దత్తత తీసుకున్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి నారాయణరావుకు కొడుకు పుట్టాడు. అతని రాజా రాయన్న.నారాయణరావు చనిపోగానే అధికారం, ఆస్తుల కోసం తగాదాలు కలిగాయి. నిజాంరాజు రాజారాయన్న చిన్నవాడైన కారణంగా గోపమ్మఅనే స్త్రీకి పాలనాధికారం యిచ్చాడు. రామేశ్వరచందర్ కు అధికారం రాదని తెలిసిన వెంటనే విలువైన ఆస్తుల్ని ఎక్కడికో తీసుకువెళ్ళాడు. నారాయణపురానికే అయివుంటుంది. అప్పట్నుంచి సంబంధాలు మారిపోయాయి.  నిజాం రాజు రాజా రాయన్నను చదివించడానికి హైదరాబాదుకు తీసుకుని వెళ్ళాడు. మీర్ లాయక్ అలీ, సర్ సాలార్ జంగ్ లతో కలిసి చదువుకున్న రాజారాయన్న ఇస్లాం మతం తీసుకున్నాడు. ఎందరినో పెండ్లి చేసుకున్నాడు. వారిలో చింతపల్లి జమీందార్ బిడ్డ సీతమ్మ, రాజమ్మ, గార్లపల్లి నర్సయ్య కుమార్తె రంగమ్మ, షేక్ మహమ్మద్ కూతురు రసూల్ బీ, జైనబ్ బేగం. హుసేనిబేగంలున్నారు.
 సంస్థానాధీశుడైన రాజా వెదిరె వెంకటనారాయణరావు బహద్దూరు సంస్థానంలోని వేంకటేశ్వర మఠానికి పూజాదికాల నిర్వహణకు మఠాధిపతి షాకరుదాసు బైరాయికి సన్ 1192(క్రీ.శ.1782)  శుభకృతు నామ సంవత్సర జ్యేష్ట శు. సప్తమి శుక్రవారము నాడు వ్రాయించి ఇచ్చాడు.గంగరాజు రాముడు కులకర్ణి రాయన్నపేట(రాజాపేట) దానపత్రము రాసాడు.
 సంస్థానం రాజాపేట రాజా వెంకటనారాయణరావు బహద్దూరు ఇచ్చిన భూదాన పత్రికః
భూదాన శాసనపాఠం:
 శుభకృతు నామ సంవత్సర జ్యేష్ట శు. సప్తమి శుక్రవారము నాడు షాకరుదాసు బైరాగికి రాజా వెదిరె వెంకటనారాయణారావు బహద్దురు సరుదేశముఖు సర్ దేశపాండ్య వసర నాడెగవుడు స.బోనగీరు వషహనగరు వరాజు కొండ యింద్రి వెల వగైరా గ్రామ వ్రాయించి యిచ్చిన భూదానపత్రిక శ్రీ.... స్వామికి నిత్యనైవేద్య దీపారాధన నడ్పవలసినాందుకు భుదానం కావలెనని మందలిస్తిరి కన్క మనస్కరించి రాయంన్నపేటలోను వుత్తరంపు వెర్గుచద్ది శివ్వారెడి చేశ్ని కవులు జాగా నీంమ్మంధం గుండ్లబావి కింద యిస్తువా చెల్క కుండెడు (జొ)న్నలు పెట్టుబడిది నిష్కష్ర చేసి శలవు యిచ్చినాం. యింద్కు హద్దులు తూర్పుకు ఉండె మర్రిచెల్క పడుమర్కు మఠ ఉత్తరానకు చెరు(?) దక్షణం చదుమస్తులు యీలోన నినర్ణం చేసి వ్రాయించి శ్రీ స్వామికి ప్రీతిగాను మీరూంన్ను మీశిష్యలూంన్ను ప్రతి సంవత్సరం జాగా ఫలపరచుకుని తత్ఫలం నిత్యనైవేద్యదీపారాధన గడుపుకుంటు మాకు ఆశీర్వచనం చేస్తూ సుఖాన వుండుకునేది. యిది హర్షోక్తిన వ్రాయించి యిచ్ని భూదానపత్రిక. చం.7 రజ్జబు
 స్వదత్తాం ద్విగుణం పుణ్యం
 పరదత్తాను పరతద్తు పహరణ
 స్వదత్తా సత్ఫలం భవేతు
 గంగరాజ రాముడు కులకర్ణి, రాయన్నపేట – వేంకటేశ్వర మఠం

మరింత సమాచారం తెలుసుకోండి: