ప్రధాని మోదీ ప్రచారానికి ఓ ప్రత్యేకత ఉంది. ప్రధాని ఎక్కడ పర్యటించినా.. అంటే బీజేపీయేతర, ఎన్డీయేతర పార్టీలు అధికారంలోకి ఉన్న రాష్ట్రాల్లోకి ప్రచారానికి వెళ్తే అక్కడి పార్టీ నాయకులు అవినీతి.. సీఎంల వ్యవహార శైలి.. ఫలానా పనిలో అవినీతి చేశారంటూ విమర్శలు చేస్తుంటారు. మనం తమిళనాడు, కేరళ, బెంగాల్  వంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే ఆయా సీఎంలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతుంటారు.


ఇది సహజంగా ప్రజల్లో ఆలోచన రేకెత్తిస్తుంది. ఎందుకంటే ప్రధాని స్థాయిలో ఉన్న వ్యక్తి అడ్డగోలు ఆరోపణలు చేయరు అని అంతా భావిస్తుంటారు. కానీ ఏపీ విషయానికొచ్చే సరికి అంతా పూర్తి రివర్స్.  ఇక్కడ టీడీపీ, జనసేనతో బీజేపీ జట్టు కట్టింది. కానీ వైసీపీ బీజేపీ కి అన్ని విధాలుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఏపీలో ఉన్న రెండు ప్రధాన ప్రాంతీయ పార్టీలు కూడా బీజేపీ మద్దతుదారులుగానే ఉన్నాయి.


అందువల్ల మోదీ ఎక్కువగా వైసీపీని టార్గెట్ చేసి విమర్శలు సంధిచడం లేదు. ఇది టీడీపీ నాయకులకు రుచించడం లేదు. గతంలో జరిగిన చిలకలూరి పేట సభలో కూడా ఏపీలో లేని ఇండియా కూటమి, కాంగ్రెస్ లను విమర్శించి.. వైసీపీని పల్లెత్తి మాట కూడా అనలేదు. మంత్రులు అవినీతి చేస్తున్నారంటూ ఓ రెండు మాటలు అన్నారు.


ఇప్పుడు ఏపీ పర్యటనలో కూడా జగన్ పేరు ఎత్తకుండా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఎక్కువగా ఇండియా కూటమి, కాంగ్రెస్ పై విమర్శలు చేయడం మొదలు పెట్టారు. దేశంలో ఎక్కడ మాట్లాడినా దేశం మొత్తం చూసేది నిజమే అయినా.. స్థానికంగా లేని శత్రువు గురించి మాట్లాడిన సమయం వృథా తప్ప  మరేమీ ఉండదు. ఏపీలో కాంగ్రెస్ ను ఎంత తిట్టినా ఉపయోగం ఏంటనే ప్రశ్న సహజంగా అందరిలో తలెత్తేదే. ఎందుకంటే ఏపీలో ఆపార్టీ ఎప్పుడో జవసత్వాలు కోల్పోయింది. ప్రస్తుతం అక్కడ హస్తానికి డిపాజిట్లు కూడా వచ్చే పరిస్థితి లేదు. మోదీ కేవలం ఇండియా కూటమినే తన శత్రువుగా భావిస్తున్నారు తప్ప వైసీపీని భావించడం లేదు. ఎందుకంటే ఆ పార్టీ బయటి నుంచి ఎన్డీయేకు బలమైన మద్దతుదారుగా ఉంది. అందువల్లే టీడీపీతో జట్టు కట్టినా.. వైసీపీని లక్ష్యం చేసుకోవడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: