వచ్చే సాధారణ ఎన్నికల్లో తెలుగు దేశం పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యేలకు షాకుల మీద షాకులు తప్పవా ? ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేల్లో సగానికి సగం మంది ఎమ్మెల్యేల సీట్లకు ఎర్త్ త‌ప్ప‌దా ? అంటే తాజాగా ఇంటిలిజెంట్‌ సర్యేలో అవుననే చెబుతున్నట్టు విశ్వసనీయవర్గాల సమాచారం ద్వారా తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఇంటిలిజెన్స్‌ విభాగం ఇటీవల చేసిన సర్వేలో ఏపీలోని 175 నియోజకవర్గాల్లో ఒక్కో నియోజకవర్గం నుంచి 500 మందికిపైగా ఓటర్లతో చేసిన ఈ సర్వేలో దాదాపు 60 మంది ఎమ్మెల్యేలు తీవ్రమైన వ్యతిరేఖతతో కొట్టుమిట్టాడుతున్నట్టు వెల్లడైంద‌ట‌.  ఎమ్మెల్యేలపై మితిమీరిన అవినీతి ఆరోపణలు, పక్షపాతం, దందాలు పెరిగిపోవ‌డం, నియోజకవర్గాల్లో గ్రూపు రాజకీయాలు తదితర కారణాలు వీరి ఓటమికి కారణం కానున్నాయి. 


ఈ సర్వేలో కాపు సామాజికవర్గంతో పాటు, ఎస్సీలు, మైనార్టీ వాటర్లు వైసీపీకే జై కొట్టినట్టు తెలుస్తోంది. ఇక చంద్రబాబు సామాజికవర్గంలో మెజార్టీ ఓటర్లతో పాటు బీసీల్లో కొన్ని కులాలు మాత్రం టీడీపీకి అండగా నిలుస్తాయ‌ని కూడా తేలినట్టు తెలుస్తోంది. ఇక ఈ సర్వే మొత్తం చాలా పారదర్శకంగా జరిగినట్టు ఇంటిలిజెన్స్‌ విభాగానికి చెందిన ఓ సీనియర్‌ అధికారి తన సన్నిహితులకు చెప్పిన స‌మాచారం బయటకు పొక్కింది. గత నాలుగేళ్లగా ఏపీలో చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగి పోయారని... ఇటు పోలవరంతో పాటు అటు రాజధాని నిర్మాణ పనులు అతీగతి లేకుండా ఉండడం, యువత నిరుద్యోగంతో కొట్టుమిట్టాడడం ప్ర‌భుత్వంపై ఉన్న వ్య‌తిరేక‌త‌కు దిక్సూచిలుగా ఉన్నాయి.


మరో వైపు పవన్‌కళ్యాణ్‌ ఎంట్రీతో ఓ ప్రధానసామాజికవర్గం ఓట్లలో భారీ చీలిక రావడం తదితర పరిణామాలన్ని ఏపీలో అధికార టీడీపీకి మైనస్‌గా మారినట్టు ఈ సర్వే స్పష్టం చేసింది. ప‌వ‌న్, బీజేపీ ఎఫెక్ట్ టీడీపీకి ఎవ్వ‌రూ ఊహించ‌న‌ట్టుగా ఉంటుంద‌ట‌. గోదావ‌రి జిల్లాల‌తో పాటు విశాఖ జిల్లాలో ప‌వ‌న్ దెబ్బ‌కు టీడీపీ కుదేల‌వుతుంద‌ని కూడా స‌ర్వేలో తేలిన‌ట్టు తెలుస్తోంది. అలాగే నియెజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు సక్రమంగా లేకపోవడం కూడా చంద్రబాబు హవా తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ తీవ్రమైన వ్యతిరేఖతను అధిగమించాలంటే చంద్రబాబు ఇప్పుడున్న ఎమ్మెల్యేల్లో కనీసం 60 మందిని మారిస్తేగానీ వచ్చే ఎన్నికల్లో ఆయనకు సానుకూల ఫలితాలు వచ్చే పరిస్థితి లేద‌ట‌.


ఇక ప‌లు స‌ర్వేల్లో ఇదే విష‌యం స్ప‌ష్టం కావ‌డంతో చంద్ర‌బాబు ఇప్ప‌టికే 30-40 మంది సిట్టింగ్‌ల‌ను ప‌క్క‌న పెట్టేయాల‌ని ప్రాథ‌మిక నిర్ణ‌యానికి వ‌చ్చేసిన‌ట్టు వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ధానంగా రిజ‌ర్వ్‌డ్ సెగ్మెంట్ల‌లో ఈ స‌మ‌స్య ఎక్కువుగా ఉన్నా... వీరినే ఎక్కువ మారిస్తే వ‌చ్చే ఇబ్బందుల‌పై కూడా ఆయ‌న స‌త‌మ‌త‌మ‌వుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: