సైకిల్ సామాన్యుడి బండి. సగటు జీవి రధం. అదే సైకిల్ ని నమ్ముకుంటే అందలాలనూ ఎక్కిస్తుందని  రాజకీయంగానూ నిరూపితమైంది. ఎంత దూరం వెళ్ళినా ఏమేం చేసినా సైకిల్ కి రెండు చక్రాలు మాత్రం ఉండి తీరాల్సిందే. మరి వాటినే తీసేస్తే సాగేదెలా. వేగేదెలా..


దన్ను లేదుగా :


టీడీపీ పోయిన ఎన్నికల్లో అటు బీసీలు, ఇటు కాపులను దన్నుగా చేసుకుని గెలిచింది. ఆ రెండు సామజిక వర్గాల సమీకరణతో బాబు ముచ్చటగా మూడవ మారు అధికారంలోకి వచ్చారు. హామీలు గుప్పించడంతో పాటు పవన్ కళ్యాణ్ సాయం కూడా ఎంతో మేలు చేసిపెట్టింది. మొత్తాని బాబు చేతికి పగ్గాలు అందేశాయి. నాలుగేళ్ళలో కధ మొత్తం ఇపుడు మారిపోయింది.


పంక్చర్ వేస్తున్నారు :


ఈసారి సీన్ రివర్శ్ అయ్యేలాగా కనిపిస్తోందట. అసలే కాపులను బీసీలో కలుపుతామని అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినందుకు టీడీపీపై బీసీలు గుర్రుగా ఉన్నారు. మరో వైపు కాపులు తమను నమ్మించి మోశం చేశారని గుస్సా  అవుతున్నారు. వ్రతం చెడినా ఫలితం దక్కని విచిత్రమైన పరిస్తితి టీడీపీది, దాంతో సైకిల్ కి పంక్చర్లు పడిపోతున్నాయట.


చేరో వైపునా :


ఇపుడు ఏపీలో సామాజిక వర్గ సమీకరణలు కొత్త పుంతలు తొక్కుతున్నాయి. దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకున్న బీసీలు ఇపుడే బయటకు వస్తున్నారు. వారు వైసీపీతో కలసి ముందుకు సాగేందుకు రెడీ అవుతున్నారు. జగన్ సైతం ఆ వర్గాలను మచ్చిక చేసెందుకు యత్నిస్తున్నారు. మరో వైపు కాపులు జనసేన వైపుగా ర్యాలీ అవుతున్నారు. పవన్ వెంట కాపు సమాజం మెల్లగా కదులుతోందని సర్వేలు చెబుతున్నాయి. ఇలా ఇద్దరూ చెరో వైపున లాగేస్తూంటే టీడీపీ కీలకమైన ఓటు బ్యాంక్ చిన్నాభిన్నం అవుతోంది.


అదే జరిగితే అంతే సంగతులు  :


ప్రధాన సామాజిక వర్గాలు ఏపీలో ఇపుడు టీడీపీపై అసంత్రుప్తిలో ఉన్నాయి. వాటికి వేరే రాజకీయ పార్టీలు కూడా ప్రత్యామ్నాయంగా కనిపిస్తున్నాయి. దాంతో ఎక్కడ లేని ధైర్యం వస్తోంది. అదే ఇపుడు టీడీపీని ఇరుకున పెడుతోంది. రేపటి ఎన్నికల్లో బీసీలు జగన్ వెంట, కాపులు పవన్ వెంట నడిస్తే తమ గతేంకానని తమ్ముళ్ళు తలలు పట్టుకుంటున్నారు. నిజంగా ఇలాగే జరిగితే మాత్రం సైకిల్ పార్టీకి గాలి తీసేసినట్లేనని అంటున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: