రేపు ఏపీలో అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను సీఎం జగన్ ప్రారంభించనున్నారు.  అత్యవసర సేవలు అందక జరిగే మరణాల సంఖ్యను గణనీయంగా తగ్గించేందుకు.. జగన్ సర్కార్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. ప్రతీ మండల కేంద్రంలో ఓ సర్వీసు అందుబాటులోఉండేలా చర్యలు తీసుకుంటున్నారు అధికారులు. 

 

ఏపీ ప్రభుత్వం సంక్షేమబాటలో ముందుకెళ్తోంది. వరుస పథకాలతో జనానికి లబ్ధి చేకూరుస్తున్న జగన్ సర్కార్.. తాజాగా అంబులెన్స్ సర్వీసులపైనా ఫోకస్ పెట్టింది. రేపు ఉదయం తొమ్మిదిన్నరకు విజయవాడ బెంజ్ సర్కిల్ దగ్గర...వెయ్యి 68 అత్యాధునిక అంబులెన్స్ సర్వీసులను ..సీఎం జగన్ ప్రారంభించనున్నారు. ఇప్పటికే ఉన్న 108, 104 సర్వీసులకు కొత్త హంగులు జోడిస్తున్నారు. అత్యవసర వైద్య సేవలు అందక జరిగే మరణాలను గణనీయంగా తగ్గించేందుకు జగన్‌ సర్కార్‌ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తోంది. కొత్తగా 412 అంబులెన్సులను కొనుగోలు చేయగా... ఇప్పటికే ఉన్న వాటిలో 336 అంబులెన్సులను ఆధునీకరించారు.  412 అంబులెన్సుల్లో 282 బేసిక్‌ లైఫ్‌ సపోర్టుకు సంబంధించినవి కాగా, 104 అడ్వాన్స్‌ లైఫ్‌ సపోర్టుతో తీర్చి దిద్దారు. మరో 26 అంబులెన్సులను చిన్నారులకు వైద్య సేవలందించేలా తయారు చేశారు.

 

బీఎల్ ఎస్ అంబులెన్సులలో స్పైన్‌ బోర్డు, స్కూప్‌ స్ట్రెచర్, వీల్‌ ఛైర్, బ్యాగ్‌ మస్క్, మల్టీ పారా మానిటర్‌ వంటి సదుపాయాలుండగా, ఏఎల్ ఎస్ అంబులెన్సులలో అత్యాధునిక వెంటిలేటర్లు ఏర్పాటు చేశారు. నియో నేటల్‌ అంబులెన్సులలో ఇన్‌క్యుబేటర్లతో పాటు, వెంటిలేటర్లను కూడా అమర్చారు. పట్టణ ప్రాంతాల్లో ఫోన్‌ చేసిన 15 నిమిషాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో 20 నిమిషాల్లో, గిరిజన ప్రాంతాల్లో 30 నిమిషాల్లో అంబులెన్సులు చేరాలన్నదే తమ లక్ష్యమని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.

 

కొత్తగా 656 మొబైల్‌ మెడికల్‌ యూనిట్లను సిద్ధం చేస్తోంది ప్రభుత్వం..  డాక్టర్‌ సహా ఐదుగురు సిబ్బంది, స్పాట్‌ వైద్య పరీక్షలు, ఉచితంగా మందుల సరఫరా వంటివి వీటిలో భాగంగా ఉంటాయి. మారుమూల ప్రాంతాల్లో అత్యాధునిక వైద్య సేవలందించటం వీటి ప్రధాన ఉద్దేశమని అధికారులు చెబుతున్నారు. ప్రతి మండల కేంద్రంలో ఒక సర్వీసు అందుబాటులో ఉంటుందని తెలిపారు..

మరింత సమాచారం తెలుసుకోండి: