గత వందేళ్లలోనే అతి పెద్ద ఆర్థిక సంక్షోభాన్ని సృష్టించింది కరోనా. ఈ మాటనేది ఎవరో కాదు... సాక్షాత్తు ఆర్ బీ ఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌. మరి ఇంతటి సంక్షోభం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. మన ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం ఎలా ఉండబోతోంది. ఆర్ బీఐ తీసుకుంటున్న చర్యలేమిటి? 

 

కరోనా దెబ్బకు అగ్రరాజ్యాల నుంచి పేద దేశాల వరకూ ఇబ్బంది పడుతున్నాయి. లాక్‌డౌన్‌ల వల్ల ఆర్థిక వ్యవస్థలు కుదేలయ్యాయి. ఇంతటి సంక్షోభం మునుపెన్నడూ చూడలేదంటున్నారు ఆర్థిక నిపుణులు. 

 

గడిచిన వందేళ్లలో కరోనా అంతటి సంక్షోభం మరొకటి సంభవించలేదన్నారు రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా గవర్నర్‌ శక్తికాంత దాస్‌. ఎస్ బీఐ బ్యాంకింగ్ అండ్ ఎకనామిక్ కాన్‌క్లేవ్‌లో ఆయన పాల్గొన్నారు. కరోనా ప్రభావం ప్రజల ఆరోగ్యంతో పాటు ఉత్పత్తి, ఉద్యోగ కల్పన రంగాలపై తీవ్రంగా పడిందన్నారు. గ్లోబల్ ఆర్డర్, గ్లోబల్ వాల్యూ చైన్‌ తీవ్రంగా ప్రభావితమయ్యాయన్నారు. మన ఆర్థిక వ్యవస్థ బలాన్ని పరీక్షించడానికి ఇదో అతి పెద్ద పరీక్ష అన్నారు శక్తికాంత దాస్‌. 

 

ప్రస్తుత సంక్షోభ సమయంలో మన ఆర్థిక వ్యవస్థను కాపాడటానికి ఆర్ బీ ఐ అనేక చర్యలు తీసుకుందన్నారు శక్తికాంత దాస్‌. కరోనా సంక్షోభానికి ముందు మందగించిన ఆర్థిక వృద్ధిని గాడిలో పెట్టడానికి ఆర్ బీ ఐ రెపో రేటును 1.35 శాతం తగ్గించినట్టు తెలిపారు. కరోనా సంక్షోభంతో మరోసారి రెపో రేటును 1.15 శాతం తగ్గించామని తెలిపారు. 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకు రెపో రేటును ఆర్ బీ ఐ 2.5 శాతం తగ్గించిందన్నారు శక్తికాంత్‌ దాస్‌.


  
ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టేందుకు తాము తీసుకుంటున్న చర్యలు ఎంత వరకూ ఫలించాయన్నది తెలుసుకోడానికి కొంత సమయం పడుతుందన్నారు శక్తికాంత దాస్‌. అయితే, ఇంత వరకూ సత్ఫలితాలు వస్తున్నట్టే కనిపిస్తోందని.... ఇది తమకు మరింత స్ఫూర్తినిస్తోందన్నారు ఆర్బీఐ గవర్నర్‌. 

 

కరోనా సంక్షోభాన్ని ఎదుర్కోడానికి గత ఫిబ్రవరి నుంచి ఇప్పటి వరకూ తొమ్మిదిన్నర లక్షల కోట్ల రూపాయల లిక్విడిటీ చర్యలు చేపట్టింది ఆర్ బీ ఐ. ఇది మన స్థూల జాతీయోత్పత్తిలో 4.7 శాతం. ఆర్థిక వ్యవస్థకు ఊతమిచ్చేందుకు సంప్రదాయ పద్ధతులతో పాటు సంప్రదాయేతర విధానాల్ని ఆర్ బీ ఐ అనుసరిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: