తీవ్ర ఆర్థిక లోటుతో ఇబ్బందులు పడుతోన్న ఆంధ్రప్రదేశ్ పై కరోనా ఎఫెక్ట్ పడింది. ఆ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే ఆదాయానికి గండి పడింది. లాక్ డౌన్ నుంచి ఉపశమనం కల్పిస్తూ కేంద్రం చర్యలు చేపట్టినా... రాష్ట్ర ఆదాయం తక్కువగా నమోదవుతూ వస్తోంది. నాలుగైదు నెలలుగా రాష్ట్ర ఆదాయంలో దాదాపు 10 నుంచి 13 వేల కోట్ల రూపాయల మేర నష్టం వాటిల్లిందన్నది ఆర్ధికశాఖ అంచనా.


కరోనా కారణంగా లాక్ డౌన్‌ విధించడంతో..., ఏప్రిల్ , మే నెలల్లో 20 శాతం కూడా వసూలు కాలేదని అధికారులు చెబుతున్నారు. అన్‌ లాక్‌ చర్యలతో ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని భావించినా.. ఊహించిన స్థాయిలో ఆర్థిక శాఖకు వెసులుబాటు కలగలేదని వివరిస్తున్నారు. జూన్, జూలై, ఆగస్ట్‌ నెలల్లో పరిస్థితుల్లో కాస్త మార్పు వచ్చినా .. ఆశించినంత ఆశాజనకంగా లేదని ఆర్ధికశాఖ స్పష్టం చేస్తోంది.


జీతాల చెల్లింపులు సహా రిటైర్డ్‌ ఉద్యోగులకు అందించే పెన్షన్‌ కూడా ప్రతి నెలా జాప్యం అవుతోంది. దీంతో ఉద్యోగుల జీతాలు.. రిటైర్డ్‌ ఉద్యోగుల పెన్షన్లు మొదలుకొని సంక్షేమ పథకాల అమలు కోసం .. రుణాలు చేయక తప్పనిసరి పరిస్థితుల్లోకి రాష్ట్రం వెళ్లిపోయింది. గడచిన నాలుగు నెలల కాలంలో రాష్ట్రానికి వస్తున్న ఆదాయం సరిపోక..  అప్పులు చేయాల్సి వచ్చింది. దీంతో ప్రభుత్వం సుమారుగా 21 వేల కోట్ల రూపాయల మేర అప్పు చేయాల్సి వచ్చింది.


ఆగస్టు నెల ప్రారంభంలో రిజర్వు బ్యాంకు నిర్వహించిన సెక్యూరిటీల వేలంలో మరో 2 వేల కోట్ల రూపాయలను ప్రభుత్వం సమీకరించింది. ఈ క్రమంలో రాష్ట్రం మెడపై అప్పుల కుప్ప 3లక్షల కోట్ల రూపాయలకు పైగా పెరిగింది. ఇది భవిష్యత్‌లో మరింత పెరిగే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవే కాకుండా.. మరిన్ని రుణాలను సమీకరించుకునే దిశగా సర్కార్‌.. ప్రణాళికలను సిద్దం చేస్తోంది. అయితే అప్పులు ఫుల్.. ఆదాయాలు నిల్‌ అనే పరిస్థితి ఉందంటూ ఆర్థిక శాఖ గగ్గోలు పెడుతోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: