కొండపైకి పాత వాహనాలను నిషేధిస్తున్నట్టు తిరుమల అడిషనల్ ఎస్పీ మునిరామయ్య వెల్లడించారు. పదేళ్లు పూర్తి చేసుకున్న వాహనాలను ఇకపై తిరుమలకి అనుమతించేది లేదని స్పష్టం చేశారు. పాతవి, ఫిట్‌నెస్ లేని వాహనాలకు తిరుమల ఘాట్ రోడ్లపై నిషేధం విధిస్తున్నట్లు పేర్కొన్నారు. 2010 కంటే ముందు రిజిస్టరైన వాహనాలను తిరుమలకు తీసుకురాకూడదని, ఫిట్‌నెస్ లేని వాహనాలను తిరుమలకు అనుమతించేది లేదని ఆయన వెల్లడించారు.ఈ నిర్ణయంతో చాలామంది యాత్రికులు తమ సొంతవాహనాల్లో తిరుమలకు వచ్చే అవకాశం కోల్పోతారు. పదేళ్ల పాత వాహనాలలో తిరుపతి వరకు వచ్చినా.. అక్కడినుంచి కచ్చితంగా వారు అనుమతించిన వాహనాల్లోనే పైకి వెళ్లాలి. ఇక ఆర్టీసీపై కూడా ఈ ప్రభావం పడుతుంది. పదేళ్లకు మించిన పాత వాహనాలు వాడుతున్న ట్రావెల్స్ సంస్థల యజమానులకి మరింత కష్టకాలం ఎదురయ్యే అవకాశం ఉంది. ఘాట్ రోడ్ లో జరిగే ప్రమాదాలు, వాయు కాలుష్యాన్ని నివారించేందుకే తిరుమల అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు రెండో ఘాట్ రోడ్డులోని శ్రీవారి సహజ శిలా స్వరూపం కనిపించే ప్రదేశంలో వాహనాలు నిలిపేస్తుండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయని అడిషనల్ ఎస్పీ పేర్కొన్నారు. ఆ ప్రదేశంలో భక్తులు వాహనాలు నిలపకుండా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తిరుమల క్షేత్రం ‘నో హారన్’ జోన్ కావడంతో భక్తులు తమ వాహనాల హారన్ మోగించకూడదని సూచించారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి