గ్రేటర్ ఎన్నికల్లో ఏ పార్టీ గెలుపు కోసం ఏ చిన్న అవకాశాన్ని కూడా వదులుకోవడంలేదు. ఎత్తులు, పైఎత్తులు, జిత్తులు, ప్రలోభాలు.. సమస్తం ఎన్నికల ప్రణాళికలో ఉంటాయి. అందులోనూ టీఆర్ఎస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. 100 స్థానాల్లో గెలిచి తీరతామంటూ ధీమాగా చెబుతున్నారు ఆ పార్టీ నేతలు. అటు బీజేపీ కూడా టీఆర్ఎస్ ఎత్తుగడలను నిశితంగా పరిశీలిస్తోంది. ఎక్కడికక్కడ అధికార పార్టీపై విమర్శలతో విరుచుకుపడుతోంది. ఈ నేపథ్యంలో గ్రేటర్ బరిలో గెలిచేందుకు టీఆర్ఎస్ కొత్త వ్యూహాన్ని అమలు చేస్తోందనే విమర్శలు మొదలయ్యాయి.

గ్రేటర్ బరిలో దాదాపు అన్ని పార్టీలనుంచి బలమైన అభ్యర్థులు బరిలో దిగారు. తాము అనుకున్న పార్టీ టికెట్ దక్కకపోయినా ఇండిపెండెంట్లుగా చాలామంది నామినేషన్లు దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఇండిపెండెంట్ అభ్యర్థులపై ఒత్తిడి తీవ్రంగా ఉందని ఇప్పటికే పోలీసులకు సమాచారం అందింది. నయానో, భయానో.. చాలామందితో నామినేషన్లను ఉపసంహరింపజేశారు. ఇంకా కొంతమంది ప్రధాన పార్టీల అభ్యర్థులకు నిద్రలేకుండా చేస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిపోవడంతో.. వీరితో లోపాయికారీ ఒప్పందాలు కుదుర్చుకునేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. అప్పటికీ వినకపోతే వారిపై పరోక్షంగా ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నాలు కూడా సాగుతున్నాయట.

ముఖ్యంగా అధికార టీఆర్ఎస్ పార్టీ ఇలా ప్రలోభాలకు దిగుతోందంటూ ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. ఇందుకోసం టీఆర్ఎస్ పోలీసు వ్యవస్థను కూడా వాడుకుంటోందని అంటున్నారు వైరి పక్షాల నేతలు. పోలీస్ యంత్రాంగాన్ని ఉపయోగించుకుంటూ.. బలమైన అభ్యర్థులను బెదిరిస్తున్నారని, పోటీలో లేకుండా చివరి నిముషంలో ప్రచారానికి దూరంగా వెళ్లేలా చేస్తున్నారని. తమవారందరికీ తాము పోటీనుంచి తప్పుకుంటున్నట్టు సంతేతాలివ్వాలని బలవంతం చేస్తున్నారని అంటున్నారు. ఒకవేళ టీఆర్ఎస్ గెలుపు అనివార్యం అయితే దానికి ఈ నిర్బంధాలే కారణం అని అంటున్నాయి ప్రతిపక్షాలు. అయితే అధికార టీఆర్ఎస్ మాత్రం ఈ ఆరోపణల్ని కొట్టిపారేస్తోంది. ఎన్నికలు నిస్పక్షపాతంగా జరుగుతున్నాయని, ప్రలోభాలు పెట్టాల్సిన అవసరం తమకు లేదని చెబుతున్నారు టీఆర్ఎస్ నేతలు. 

మరింత సమాచారం తెలుసుకోండి: