పాలిటిక్స్‌లోకి రావడం లేదంటూ తలైవా రజనీకాంత్‌ క్లారిటీ ఇవ్వడంతో... తమిళ రాజకీయాల దృష్టి.. ఇప్పుడు చిన్నమ్మ శశికళ మీద పడింది. వచ్చే నెలలో ఆమె జైలు నుంచి విడుదల కానుండటంతో... అరవ రాజకీయాల్లో అనూహ్య మార్పులు వస్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఖరారైన తేదీ కంటే ముందే.. ఆమె విడుదలయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

అక్రమాస్తుల కేసులో శిక్ష అనుభవిస్తున్న దివంగత జయలలిత నెచ్చెలి శశికళ.. జనవరిలో నిర్ణీత గడువుకు ముందే కారాగారం నుంచి విడుదలయ్యే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. జనవరి 27న విడుదల కానున్నట్లు జైలు అధికారులు తెలిపినప్పట్టికీ.. అంతకంటే ముందే ఆమె బయటకు వస్తారని తాము భావిస్తున్నట్టు శశికళ తరపు న్యాయవాది చెప్పడం విశేషం.

జనవరి 27న చిన్నమ్మ బయటకు రావడం ఖాయమని తేలిపోవడంతో.. ఆమె అభిమానులు, అమ్మ మక్కల్‌ మున్నేట్ర కళగం శ్రేణులు ఆనందం వ్యక్తం చేస్తున్నాయి. అయితే అంతకు ముందే ఆమె విడుదలయ్యే అవకాశం ఉందనే సమాచారం అందడంతో.. మరింత సంబరాల్లో మునిగితేలుతున్నారు. బెంగళూరు నుంచి చెన్నైకి వచ్చే మార్గంలో 65 చోట్ల శశికళను స్వాగతించేందుకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు అభిమానులు. తొలుత ఆమె మెరీనా తీరంలోని జయలలిత సమాధి దగ్గరకు.. వెళ్లి నివాళులు అర్పిస్తారు.

రాజకీయాల్లో రావడం లేదంటూ.. రజనీకాంత్‌ క్లారిటీ ఇచ్చేయడంతో ఇప్పుడు తమిళ రాజకీయాల దృష్టి.. జైలు నుంచి విడుదలవుతున్న శశికళ వైపు మళ్లింది. ఆమె రీ ఎంట్రీతో.. అరవ రాజకీయాల్లో పెనుమార్పులు ఖాయమనే ప్రచారం జోరందుకుంది.

మొత్తానికి రజినీకాంత్ రాజకీయాల నుంచి తప్పుకోవడంతో తమిళ రాజకీయాలు అనూహ్యమలుపు తిరుగుతున్నాయి. ఇప్పుడు అందరి చూపంతా శశికళ వైపే ఉంది. ఇక ఆమెనే తమిళనాట చక్రం తిప్పుతారనే ఊహాగానాలు బలంగా వినిపిస్తున్నాయి. ఆమె జైలు నుంచి విడుదల కావడం ఆలస్యం తన సత్తా ఏంటో చూపించి రానున్న ఎన్నికల్లో విజయదుందుభి మోగిస్తారని భావిస్తున్నారు. చూద్దాం.. ముందు ముందు ఎలాంటి పరిణామాలు జరుగుతాయో.




మరింత సమాచారం తెలుసుకోండి: