దేశవ్యాప్తంగా కరోనా కేసులు పెరుగుతున్న వేళ.. కేరళ, మహారాష్ట్ర సరిహద్దు రాష్ట్రాలు భయాందోళనలకు గురవుతున్నాయి. కేరళ, మహారాష్ట్రల్లో కేసులు భారీగా పెరుగుతుండటంతో ఇతర రాష్ట్రాల ప్రజలు, ప్రభుత్వాలు ఆందోళనకు గురవుతున్నాయి. సరిహద్దుల వద్ద చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేస్తున్నా పూర్తి స్థాయిలో పరీక్షలు జరగడంలేదు కాబట్టి ఎలాంటి ఉపయోగం లేదని తెలుస్తోంది. మరోవైపు తెలంగాణలో కొత్తరకం కరోనా జాడలు కనపడినట్టు కేంద్రం ప్రకటించడం మరింత ఆందోళన కలిగించే విషయం.

కరోనా కారక సార్స్‌-కొవ్‌-2 వైరస్‌కు సంబంధించి ఎన్‌440కె, ఈ484కె రకాలను దేశంలోని మహారాష్ట్ర, కేరళల్లో గుర్తించినట్లు కేంద్రం తెలిపింది. ఈ రెండు వైరస్ రకాల్లో ఒకదాని జాడ తెలంగాణలోనూ కనిపించిందని వెల్లడించింది. మహారాష్ట్ర, కేరళ లోని కొన్ని జిల్లాల్లో కేసులు పెరగడానికి ఈ కొత్తరకాలు ప్రధాన కారణం కాదని చెప్పడం ఒక్కటే కాస్త ఊరటనిచ్చే అంశం.
బ్రిటన్‌ రకం వైరస్‌ కనిపించిన తర్వాత భారత ప్రభుత్వం విభిన్న విభాగాలకు చెందిన పది ప్రయోగశాలలను జోడించి కన్సార్టియం ఏర్పాటుచేసిందని తెలిపారు నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్. ఇప్పటివరకు అది 3,500 వైరస్‌ల జన్యుపరిణామక్రమాలను ఈ కన్సార్టియం విశ్లేషించిందని, అందులో 187 మందిలో బ్రిటన్‌, ఆరుగురిలో దక్షిణాఫ్రికా, ఒక వ్యక్తికి బ్రెజిల్‌ రకం వైరస్‌ సోకినట్లు తేలిందని చెప్పారు. జన్యుపరిణామక్రమాన్ని గుర్తించేటప్పుడు ఇంకా ఏమైనా ఉత్పరివర్తనాలు వచ్చాయేమోనని నిరంతరం శాస్త్రవేత్తలు పరిశీలిస్తున్నట్టు తెలిపారు.

మహారాష్ట్ర, కేరళ ల్లో గుర్తించిన రెండు కొత్తరకం వైరస్ లలో ఒకటి  తెలంగాణలో కూడా కనిపించినట్టు కేంద్రం ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. అయితే కొత్తరకం వైరస్ ల వల్ల కేసుల సంఖ్య పెరగడంలేదని తేల్చి చెప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. అయితే వైరస్ రూపాంతరం చెందడం సహజమైన ప్రక్రియేనని, దాని వల్ల కొత్తగా వ్యాధి తీవ్రత లక్షణాలలో మార్పులేవీ ఉండవని చెబుతున్నారు. మరోవైపు దేశంలో కరోనా కేసుల పెరుగుదలకు వైరస్‌లో వచ్చిన మార్పులను కారణంగా చెప్పలేమని భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్‌) డైరెక్టర్‌ జనరల్‌ బలరాం భార్గవ కూడా చెప్పారు. మాస్క్‌ ధరించడం కొనసాగించాలని ప్రజలకు సూచించారు. సామూహిక సమావేశాలను తగ్గించాలని చెప్పారు. 50 ఏళ్ల పైబడిన వయోవృద్ధులకు టీకాలు వేసే కార్యక్రమం అతి త్వరలో ప్రారంభించబోతున్నట్లు తెలిపారాయన. 

మరింత సమాచారం తెలుసుకోండి: