తెలంగాణలో పార్టీ పెట్టిన వైఎస్‌ షర్మిల దూకుడు ప్రదర్శిస్తోంది. నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించి.. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ ముందుకు సాగుతోంది. విమర్శలను పట్టించుకోకుండా పాదయాత్రను కొనసాగిస్తోంది. తెలంగాణాలో ఉండే వైఎస్సార్‌ అభిమానుల అండతో పార్టీ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తోంది. వారం రోజులుగా ప్రజలతో కలిసి నడుస్తూ.. సమస్యలు తెలుసుకుంటూ వెళుతోంది. అధికార పార్టీపై విమర్శలు ఎక్కుపెడుతూ సాగిపోతోంది. సీఎం కేసీఆర్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ షర్మిల తన యాత్ర కొనసాగిస్తోంది. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల విషయంలోనూ షర్మిల పూర్తి క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది.

రాబోయే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్ ఇలా ఏ పార్టీతో పొత్తులు పెట్టుకోమని అప్పుడే ప్రకటించేసింది షర్మిల. ఒంటరిగానే బరిలో ఉంటామని తేల్చిచెప్పింది. రాబోయే రోజుల్లో అత్యధిక స్థానాల్లో పోటీచేయడమే కాకుండా.. గెలిచి చూపిస్తామని కూడా షర్మిల అంటోంది. టీఆర్ఎస్, బీజేపీ కలిసి తెలంగాణ రాష్ట్రంలో పనిచేస్తున్నాయని.. పైకి మాత్రం శత్రువుల్లా నటిస్తున్నారని ఆమె విమర్శించింది. రాష్ట్రంలో ప్రస్తుతం పాలన పూర్తిగా గాడి తప్పిందని.. తిరిగి వైఎస్సార్ పాలన తీసుకొచ్చేందుకే తాను రాజకీయాల్లోకి వచ్చానని పాదయాత్రలో చెబుతూ ముందుకు సాగుతోంది షర్మిల.

అయితే తెలంగాణాలో ఏ పార్టీతో పొత్తుల్లేవని ప్రకటించడంతో షర్మిల వెనుక నడుస్తున్న నేతల్లో కూడా ఉత్సాహం పెరిగింది. పొత్తుల్లేవని చెప్పింది కాబట్టి.. అన్ని చోట్లా అభ్యర్థులు నిలబడతారు. అంటే అభ్యర్థులకు పండగే.. ఇప్పటివరకూ ఎన్నో పార్టీలలో పనిచేస్తూ ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉన్న చాలామందికి షర్మిల ప్రకటన కొత్త ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇప్పటికే ఇతర పార్టీల్లో ఉండే వారిని కూడా షర్మిల ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. గతంలో వైఎస్సార్ పరిపాలనలో తెలంగాణలో సువర్ణ పరిపాలన కొనసాగిందని.. తనకు ఒక అవకాశం ఇస్తే.. మళ్ళీ రాజన్న రాజ్యం తీసుకొస్తానని అంటోంది షర్మిల. మొత్తమ్మీద పొత్తులపై ఆమె పూర్తిగా క్లారిటీతో ఉన్నట్టు తెలుస్తోంది. ప్రధాన పార్టీలతో పొత్తు పెట్టుకోనని తేల్చి చెప్పింది. తెలంగాణలో ఉద్యమ పార్టీలతో ఆమె కలసి ముందుకు సాగుతుందేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: