ఆరోగ్యమే మహా భాగ్యం అన్నారు మన పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని మనం నిర్లక్ష్యం చేస్తున్నాం. ఆరోగ్యంగా ఉంటేనే ఏమైనా చేయగలమనేది మరిచి ప్రవర్తిస్తున్నాం. కానీ ఈ నూతన సంవత్సర వేళ.. ఆరోగ్యంపై దృష్టి పెట్టాలనేది రెజల్యూషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోజూ అరగంట నడవడం లేదా వ్యాయామం చేయడం, యోగా, ధ్యానం, జిమ్.. ఇలా ఏ రూపంలో అయినా ఒళ్లు వంచండి. చెమటోడ్చండి. దీంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉండటంతో పాటు మానసికంగా ఉల్లాసంగా ఉంటారు.
మనలో చాలా మందికి సిగరెట్, మద్యం తాగే అలవాటు ఉంటుంది. ఇవి మన ఆరోగ్యాన్ని పాడు చేయడంతో పాటు నష్టాన్ని మిగులుస్తాయి. మనం కాల్చే సిగరెట్ మనతో పాటు మన చుట్టూ ఉన్న వారినీ దహించివేస్తోంది. కాబట్టి ఈ న్యూ ఇయర్ నుంచి సిగరెట్, ఆల్కహాల్, గుట్కా, పాన్ మసాలా లాంటి దురలవాట్లకు దూరంగా ఉండండి. కేవలం ఇవే కాదు మీకు మరే దురలవాట్లున్నా వాటికి దూరంగా ఉండండి కొత్త మార్పునకు నాంది పలకండి.
ఓ పుస్తకం మంచి మిత్రునితో సమానం అని చెబుతారు. కానీ డిజిటల్ యుగంలో మనం పుస్తకాలు చదవడమే మానేశాం. కొత్త సంవత్సరంలో పుస్తకాలు చదవడాన్ని ఓ రెజల్యూషన్ గా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పుస్తకాలు మీకు ఎన్నో కొత్త విషయాలు చెబుతాయి. మీలో పరిపక్వతకు ఇవి దోహదం చేస్తాయి. పది మందిలో మీరు ఏదైనా మాట్లాడాలంటే అవసరమైన జ్ఞానాన్ని పుస్తక నేస్తాలు నేర్పిస్తాయి. కథలు, నావెల్స్ లాంటి ఏ తరహా పుస్తకమైనా చదవడం మొదలుపెట్టండి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి