దేశంలో కొంత కాలంగా పెట్రోల్ ధరలు స్థిరంగా ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరలు పెరుగుతున్నా,ఆయిల్ కంపెనీలు, పెట్రో ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి మార్పులు చేయడం లేదు.అయితే త్వరలోనే పెట్రో బాదుడు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇంతకీ పెట్రోల్ ధరలు మళ్లీ ఎప్పుడు పెరుగుతాయి? ఓవైపు కరోనా విజృంభిస్తుంటే,మరోవైపు పెట్రోల్ ధరలకు రెక్కలు వచ్చాయి. ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల్ ధరలు మైనస్ లో కి వెళ్లి పోతే మన దగ్గర మాత్రం రికార్డులను తిరగరాశాయి. పెట్రోల్,డీజిల్ ధరలను రోజు పైసల్లో పెంచుకుంటూ వెళ్లాయి చమురు కంపెనీలు. గత ఏడాది అక్టోబర్ చివరి నాటికి దేశంలో లీటర్ పెట్రోల్ ధర 115 రూపాయల స్థాయికి చేరింది.

 లీటర్ పెట్రోల్ ధర హైదరాబాదులో గరిష్ఠంగా 114.49 పైసలకు చేరగా,  డీజిల్ ధర 107.40 పైసలకు చేరింది.ముంబైలో లీటర్ పెట్రోల్ 115.80 పైసలు, డీజిల్ ధర106.62 పైసలకు చేరింది. వంట గ్యాస్ తో పాటు ఇతర పెట్రో ఉత్పత్తుల పైన ఇదే తరహాలో బాదుడు కొనసాగించాయి చమురు కంపెనీలు. గత ఏడాది నవంబర్ 4న లీటర్ పెట్రోల్ పై 5 రూపాయలు, డీజిల్ పై 10 రూపాయలు చొప్పున ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించింది కేంద్ర ప్రభుత్వం.లీటర్ పెట్రోల్ పై ఎక్సైజ్ సుంకాన్ని 32.90పైసల నుంచి 27.90 తగ్గించింది. అలాగే లీటర్ డీజిల్ పై ఎక్సైజ్ బారాన్ని 31.80 నుంచి 21.80 పైసలకు తగ్గించింది. ప్రస్తుతం హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర 108.18 పైసలుగా ఉంటే, లీటర్ 94.61పైసలు గా ఉంది.గత కొంత కాలంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు పెరుగుతున్నాయి. అంతర్జాతీయంగా ధరలు పెరుగుతున్నప్పటికీ ప్రభుత్వ రంగ చమురు సంస్థలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ తమ పెట్రో ఉత్పత్తుల ధరల్లో ఎలాంటి మార్పు చేయలేదు. ప్రస్తుతం బ్యారెల్ క్రూడాయిల్ 95 అమెరికన్ డాలర్లు పలుకుతోంది. త్వరలోనే బ్యారెల్ పై 40 నుంచి 70 సెంట్లు పెంచే యోచనలో ఉంది సౌదీ అరేబియా.

ఈ పరిస్థితుల్లో మన దగ్గర ఏంటనే ప్రశ్న వాహనదారుల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పూర్తి కాగానే పెట్రో బాదుడు తప్పకపోవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతున్నాయి. మార్చి 10 తర్వాత ప్రతి లీటరు పెట్రో ఉత్పత్తుల పై 8 నుంచి 9 రూపాయల వరకు ధరలు  పెరిగే అవకాశం ఉందని అంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా చమురు ధరలను సవరించే అధికారం చమురు కంపెనీలకు ఉన్నా,జనం నుంచి వ్యతిరేకత వస్తుందనే కారణంతో వెనకడుగు వేస్తున్నాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొత్తానికి అంతర్జాతీయ చమురు ధరల పరిణామాల దృష్ట్యా మన దేశంలో పెట్రో ఉత్పత్తుల ధరలకు త్వరలో రెక్కలు రావడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: