పెట్రోలు ధరలు ప్రస్తుతానికి లీటర్ కి రూ. 9.50, డీజిల్ లీటర్ ధర రూ.7 వరకు తగ్గింది. భవిష్యత్తులో ఈ రేట్లు మరింత తగ్గుతాయనే ప్రచారం ఉంది. అందులో వాస్తవం ఎంత..? ఈ విషయం తెలుసుకునే ముందు అసలు పెట్రోల్ రేట్లను కేంద్రం ఎందుకు తగ్గించించో అవగాహన పెంచుకోవాలంటున్నారు నిపుణులు. ఇటీవల ఐదు రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికల తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని పెట్రోల్, డీజిల్, వంట గ్యాస్ సిలిండర్ రేట్లను భారీగా పెంచింది కేంద్రం. దీంతో సామాన్యుల్లో విపరీతమైన వ్యతిరేకత వచ్చింది. కానీ ఎన్నికలు ఇప్పుడల్లా లేవు రెండేళ్ల తర్వాత ఎన్నికల్లో ప్రజలు తమ వ్యతిరేకతను ప్రతిబింబించే అవకాశం ఉంది. దీంతో కాస్త ముందుగానే కేంద్రం జాగ్రత్తపడుతోంది.

పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ ట్యాక్స్ తగ్గిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీని ద్వారా వచ్చే నష్టాన్ని తానే భరిస్తానని కూడా ప్రకటించింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈమేరకు ప్రకటించారు. అయితే భవిష్యత్తులో కూడా ఈ తగ్గుదల ఉంటుందని అంచనా వేస్తున్నారు నిపుణులు.

గతంలో కరోనా సమయంలో పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పతనం అయ్యాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇంధనానికి డిమాండ్ తగ్గిపోవడంతో ఆమెరకు సప్లై తగ్గించుకోవాల్సి వచ్చింది. పోటా పోటీగా ఇంధనాన్ని ఎగుమతి చేస్తున్న దేశాలు ధరలు తగ్గించాయి. ఆ సమయంలో కూడా భారత్ లో రేట్లు తగ్గలేదు. రేట్లు తగ్గించకుండా వచ్చిన ఆ లాభాన్ని కేంద్రమే తీసేసుకుంది. ఆ తర్వాత ప్రపంచ వ్యాప్తంగా బ్యారెల్ రేట్లు పెరిగిందనే సాకుతో భారత్ లో రేట్లు పెంచారు. అంటే స్పష్టంగా ఇక్కడ కేంద్రం ఉద్దేశాన్ని అర్థం చేసుకోవచ్చు. అంతర్జాతీయ మార్కెట్లో రేట్లు తగ్గినప్పుడు ఆ లాభాన్ని వినియోగదారులకు అందించలేదు. కానీ రేట్లు పెరిగినప్పుడు మాత్రం ఆ భారాన్ని ప్రజలపై మోపేందుకు వెనకాడలేదు. దీంతో సామాన్యులలో ఎన్డీఏ ప్రభుత్వంపై క్రమక్రమంగా వ్యతిరేకత పెరుగుతోందనే ప్రచారం మొదలైంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ కి కూడా ఇదే ప్రధానాస్త్రంగా మారే అవకాశముంది. మేం అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు, వంటగ్యాస్ రేట్లు భారీగా తగ్గిస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తే.. అప్పటికి బీజేపీకి మరో ప్రత్యామ్నాయం ఉండదు. అందుకే ముందు జాగ్రత్తగా రేట్లు తగ్గించింది. రాబోయే రోజుల్లో మరోసారి భారీ తగ్గింపు ఉండే అవకాశాన్ని కొట్టిపారేయలేం.


మరింత సమాచారం తెలుసుకోండి: