జనసేన అధినేత పవన్ కల్యాణ్ విషయంలో చాలామంది అనుకున్నట్లే జరుగుతోంది. రాజకీయంగా పవన్ తన అజ్ఞానాన్ని మరోసారి బయటపెట్టుకున్నారు. పొత్తుల విషయంలో స్ధిరత్వం లేకపోవటం, విషయ పరిజ్ఞానం లేకపోవటం లాంటి అనేక కారణాలవల్ల ఇపుడు ఎటూ కాకుండా పోయే ప్రమాదంలో పడతారా అనే అనుమానాలు పెరుగుతున్నాయి. మొదటినుండి మిత్రపక్షంగా ఉన్న బీజేపీతో మనస్పూర్తిగా ఉండలేకపోతున్నారు. ఇదే సమయంలో ఎంతోనమ్మకం పెట్టుకున్న ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడు చేయిచ్చేట్లుగా ఉన్నారు.





అంటే ఇటు బీజేపీకి అటు టీడీపీకి కాకుండా పోయే ప్రమాదంలో పవన్ పడిపోతున్నారు. అందుకనే తాజాగా ప్రకటించిన మూడు ప్రత్యామ్నాయాల్లో జనసేన ఒంటిరిగా పోటీచేయటమనే ఆప్షన్ కూడా ఉంచుకున్నారు. పవన్ ప్రకటించిన మూడు ఆప్షన్లు ఏమిటంటే బీజేపీతో పొత్తు కంటిన్యు చేయటం. రెండోది ఏమిటంటే టీడీపీని కూడా కలుపుకుని పొత్తుల్లో పోటీచేయటం. ఇక మూడోదేమిటంటే జనసేన ఒంటరిగా పోటీచేయటం.





నిజానికి మొదటిది, మూడో ఆప్షన్ మాత్రమే పవన్ చేతిలో ఉంది. రెండో ఆప్షన్ సానుకూలమవ్వాలంటే నరేంద్రమోడి తలచుకోవాల్సిందే. పవన్లోని అజ్ఞానం ఇక్కడే బయటపడింది. బీజేపీతోనే కంటిన్యు అవదలచుకున్నపుడు ఏపీలోని బీజేపీ నేతలతో తనకు ఎలాంటి సంబంధంలేదని ఎందుకు చెప్పారు ? తన సంబంధాలంతా ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనే కానీ ఏపీలోని నేతలతో కాదని స్పష్టంగా ప్రకటించారు. పవన్ ప్రకటన చూడగానే బీజేపీ చీఫ్ సోమువీర్రాజు అండ్ కో లో బాగా మంటమొదలైంది.





జనసేన అధినేత తమను అవమానిస్తున్నట్లుగా ఫీలవుతున్నారు. దాంతో సీనియర్ నేతలంతా బాగా మండిపోతున్నారు. ఇలాంటి పరిస్ధితుల్లో పొత్తు కంటిన్యు చేయాల్సొచ్చినా మనస్పూర్తిగా ఎలా పవన్ తో ఉండగలరు ? ఇదే సమయంలో పవన్ తో పొత్తు పెట్టుకుంటే నష్టమేనని చంద్రబాబులో ఆలోచన మొదలైందట. జనాలంతా టీడీపీని అధికారంలోకి తేవటానికి రెడీగా ఉన్నారు కాబట్టి ఎవరితోను పొత్తు అవసరంలేదని తమ్ముళ్ళు చంద్రబాబు నెత్తిన కూర్చున్నారట. దాంతో పొత్తు విషయాన్ని చంద్రబాబు పక్కనపెట్టేశారు. అంటే ఇటు బీజేపీని పవన్ దూరంపెట్టేసి అటు చంద్రబాబూ జనసేనను దూరం పెట్టేస్తే పవన్ పరిస్ధతి ఏమిటి ? మరో ఐదేళ్ళు పార్టీని పట్టిపెట్టుకునేంత ఓపిక, ఆసక్తి పవన్లో ఉందా ?




మరింత సమాచారం తెలుసుకోండి: