గత ఎనిమిది సంవత్సరాల నుండి దేశంలో బీజేపీ కూటమి అధికారంలో ఉంది. దీనితో దేశ వ్యాప్తంగా అన్ని రాష్ట్రాలలో బలంగా మారడానికి తగిన ప్రయత్నాలు చేస్తోంది. ఇక బలమైన ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ కూడా బీజేపీ ని ఎదుర్కోలేని స్థితికి పడిపోయింది. దీనితో అధిష్టానం కూడా చాలా బలహీనంగా మారిపోయింది. ప్రస్తుతం పార్టీలో ఉన్న ఏ ఒక్క సీనియర్ కూడా అధిష్టానం మాట వినడం లేదు.. ఆయా రాష్ట్రాల్లో తమకు ఇష్టం వచ్చినట్లు చేసుకుపోతున్నారు. ఇందుకు దేశ వ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో జరుగుతున్న తీరును ఉదాహరణలుగా చెప్పుకోవచ్చు.

రాజస్థాన్ లో కాంగ్రెస్ అధికారంలో ఉన్నదంటే అందుకు ప్రధాన కారణం యువనేత సచిన్ పైలట్. ఇది అధిష్టానికి తెలుసు, కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉండగా ఎన్నికల ముందు చాలా కష్టపడ్డాడు. ముఖ్యంగా అభ్యర్థుల ఎంపిక మరియు ప్రచార సమయంలో సచిన్ వ్యూహాలు కాంగ్రెస్ ను గెలిపించాయి అని చెప్పాలి. అయితే కాంగ్రెస్ లో అందరూ కూడా సచిన్ సీఎం అవుతారని ఊహించారు. కానీ అధిష్టానం మాత్రం సచిన్ కష్టాన్ని తుంగలో తొక్కేసి సీనియర్ నాయకుడు అశోక్ గెహ్లాట్ ను సీఎంగా చేసి చాలా మంది స్థానిక నాయకుల విశ్వాసాన్ని అధిష్టానం కోల్పోయింది.

ఇక ఇదే విధంగా మధ్యప్రదేశ్ లో కూడా పొరపాటు చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఎన్నికల సమయంలో ప్రతిక్షణం నేనున్నాను అంటూ కాంగ్రెస్ గెలుపుకు కృషి చేసిన జ్యోతిరాదిత్య సింధియాను కాదని కమలనాధ్ ను సీఎం ను చేశారు. అలా చిన్న చిన్న చినుకులుగా మొదలైన సమస్య కాస్తా తుపానుగా మారి మధ్యప్రదేశ్ లో ప్రభుత్వమే పడిపోయింది. అయితే సమస్యను పరిష్కారం చేయకుండా ప్రేక్షకుల్లా చూస్తుండిపోయి ప్రభుత్వ పతనానికి కారణం అయింది.

పంజాబ్ లోనూ కాంగ్రెస్ అధిష్టానం ఇలాగే వ్యవహరించి కాంగ్రెస్ ఓటమిలో కీలక పాత్ర పోషించింది. రాజకీయంగా అంతగా బలం లేని నవజ్యోత్ సింగ్ ను పీసీసీ అధ్యక్షుడిగా చేసి సీఎంగా ఉన్న కెప్టెన్ అమరీందర్ సింగ్ కు కోపం తెప్పించింది అధిష్టానం. సిద్దు సైతం తన పదవిని పార్టీ అభివృద్ధికి కాకుండా, అమరీందర్ సింగ్ పై ప్రతీకారం తీర్చుకోవాడానికి ఉపయోగించాడు. దానితో విసుగు చెందిన అమరీందర్ సింగ్ పార్టీ నుండి వెళ్ళిపోయాడు. ఇక పంజాబ్ లో సైతం ఈ కారణంగానే దారుణంగా ఓటమి పాలయింది. అలా దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ బలహీనపడడానికి కారణం కాంగ్రెస్ అధిష్టానం చేసిన తప్పులే అన్నది ప్రముఖులు అంటున్న మాట.
మరింత సమాచారం తెలుసుకోండి: