టీడీపీ నాయకులు, కార్యకర్తల నిరసనలతో అనపర్తిలో ఉద్రిక్తత నెలకొంది. పొత్తులో భాగంగా అనపర్తి అసెంబ్లీ నియోజకవర్గం స్థానాన్ని బీజేపీకి కేటాయించడంతో టీడీపీ కార్యకర్తలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం రాత్రి నుంచి ప్రారంభమైన ఆందోళనలు గురువారం తారాస్థాయికి చేరుకున్నాయి. టీడీపీ పోస్టర్లు, జెండాలు, పార్టీ గుర్తు సైకిల్‌ను దగ్ధం చేశారు. ఈ సందర్భంగా కార్యకర్తలను ఉద్దేశించి నల్లమిల్లి మాట్లాడుతూ.. ఆందోళన చెందవద్దని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. తనకు టికెట్ రాకుండా చేసేందుకు పెద్ద కుట్ర జరిగిందని, తనకు జరిగిన అన్యాయాన్ని వివరిస్తానని స్పష్టం చేశారు. ఓ దశలో కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రజల నిర్ణయం మేరకే ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. తాను టీడీపీకి మద్దతివ్వబోనని, బీజేపీకి ఓటు వేయమని అడగబోనని స్పష్టం చేశారు. నియోజకవర్గంలో బలం లేని బీజేపీకి సీటు ఎలా కేటాయిస్తారని ప్రశ్నించారు.

చంద్రబాబు నల్లమిల్లికి ఫోన్ చేసి శాంతింపజేసే ప్రయత్నం చేశారు. రామకృష్ణారెడ్డి తన అభిప్రాయాన్ని సూటిగా వెల్లడించారు. నియోజకవర్గ పరిస్థితిని, కార్యకర్తల బాధలను వివరించారు. అక్రమ కేసులు పెట్టి పార్టీ కోసం ప్రాణాలర్పించి పనిచేశానన్నారు. గతంలో వైఎస్ఆర్ ఫోన్ చేసినా పార్టీని వీడలేదన్నారు. కుటుంబంతో సహా ప్రజల ముందుకు వెళ్లి తనకు, తన కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు వివరించి ఆదుకోవాలని రామకష్ణా రెడ్డి అన్నారు.

ఐదేళ్లలో తనపై వైసీపీ ఎన్ని కుట్రలు పన్నినా తనపై 39 కేసులు, ఉద్యమకారులపై సుమారు 200 కేసులు పెట్టినా వెనక్కి తగ్గలేదని గుర్తు చేశారు. తనకు టికెట్‌ రాకుండా ప్రస్తుత అనపర్తి ఎంఎల్‌ఎ డాక్టర్‌ సత్తి సూర్యనారాయణ రెడ్డి బావమరుదులు పనిచేశారన్నారు. టిడిపిలో తన కుటుంబానికి ఇలాంటి పరిస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదన్నారు. టీడీపీ కోసం అహర్నిశలు కష్టపడ్డానని, తనకు టికెట్ ఇవ్వలేదన్నారు. ఈ ఘటనపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు స్పందించకపోవడంపై నల్లమల్ల కుటుంబం వాపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: