ప్రకాశం, నంద్యాల జిల్లా సరిహద్దు నియోజకవర్గం గిద్దలూరు. నల్లమల అటవీ ప్రాంతం కావడంతో వెనుకబడిన నియోజకవర్గంగా పేరు. నియోజకవర్గాల పునర్‌విభజన నాటి నుంచి వరుసగా మూడు సార్లు టీడీపీ ఓడిపోయింది. 2009లో ప్రజారాజ్యం పార్టీ, 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచింది. అయితే 2009లో గెలిచిన అన్నా రాంబాబు.. 2014లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. 2014లో గెలిచిన ముత్తముల అశోక్ రెడ్డి 2019లో టీడీపీ తరఫున పోటీ చేసి ఓడారు. గిద్దలూరు నియోజకవర్గం ఓటరు అభ్యర్థిని చూసి కాకుండా పార్టీ గుర్తు చూసి గెలిపిస్తున్నారనే మాట వాస్తవం. గిద్దలూరు నియోజకవర్గంలో పరిధిలోని కంభం, తురిమెళ్ల, రాచర్ల మండలాల్లో కాపు సామాజికవర్గం ఓటర్లు అధికం.


అందుకే ఇక్కడ నుంచి 2009లో ప్రజారాజ్యం అభ్యర్థి గెలిచారు. అయితే 2014లో పిడతల సాయికల్పనా రెడ్డి బలపరిచిన ముత్తములకు గిద్దలూరు ప్రజలు ఓట్లు వేశారు. ముత్తముల పార్టీ మారినప్పటికీ... 2019లో మాత్రం... వరుసగా రెండోసారి వైసీపీని గెలిపించారు. ఈసారి మాత్రం టీడీపీ తరఫున ముత్తముల అశోక్ రెడ్డి పోటీ చేస్తుండగా... వైసీపీ తరఫున మార్కాపురం ఎమ్మెల్యే కుందురు నాగార్జున రెడ్డి పోటీ చేస్తున్నారు.


మార్కాపురం నియోజకవర్గంలో 1989  నుంచి కుందురు కుటుంబం పెత్తనం చేస్తోంది. తండ్రి కేపీ కొండారెడ్డి రాజకీయ వారసునిగా వచ్చిన నాగార్జున రెడ్డి... ఎన్నికైన తొలిసారే కావాల్సినంత అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు. ఆంధ్ర నయిమ్ అంటూ చంద్రబాబు బహిరంగంగానే ఆరోపించారు. మార్కాపురంలో భూకబ్జాలకు పాల్పడినట్లు సొంత పార్టీ నేతలో కేసులు కూడా పెట్టారు. దీంతో నాగార్జున రెడ్డిని రెడ్డి సామాజిక వర్గం ఓటర్లు అధికంగా ఉన్న గిద్దలూరుకు జగన్ బదిలీ చేశాడనే మాట వినిపిస్తోంది. ఐదేళ్లుగా ముత్తముల నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించారు.


అదే సమయంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు సొంత పార్టీ నేతలు సహకరించలేదు. ఒకదశలో రాజకీయాలకు గుడ్ బై అంటూ అన్నా రాంబాబు స్వయంగా ప్రకటించారు కూడా. పైగా ఐదేళ్లలో నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి శూన్యమనే మాట వినిపిస్తోంది. రాచర్ల గేటు దగ్గర ఫ్లై ఓవర్ నిర్మిస్తా అంటూ హామీ ఇచ్చారు ఎమ్మెల్యే. కానీ అది నెరవేరలేదు. పైగా టీడీపీ నేతలపై దాడులు అధికమయ్యాయి. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ముత్తయ్య అనే టీడీపీ కార్యకర్త హత్య జరిగింది. దీనిపై తీవ్రంగా స్పందంచిన ఈసీ... ఏకంగా జిల్లా ఎస్పీని బదిలీ చేసింది కూడా.


ఐదేళ్లుగా పార్టీలో చేరికలపై ఎక్కువగా దృష్టి పెట్టారు ముత్తముల. గ్రామాలకు గ్రామాలను టీడీపీలోకి తీసుకువచ్చారు. టమోటా అధికంగా సాగు చేసే గిద్దలూరు నియోజకవర్గంలో గిట్టుబాటు ధర లేక రైతులు ఆందోళన చేశారు. టమోటా కోసం ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని అశోక్ హామీ ఇస్తున్నాడు. వీటన్నిటికి తోడు... కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పడుతుందని గత ఎన్నికల్లో వైసీపీ నేతలు హామీ ఇచ్చారు. కానీ ఆ హామీ నెరవేరలేదు. ఇప్పుడు ఇదే హామీని చంద్రబాబు ఇస్తున్నారు.


అధికారంలోకి వచ్చిన వెంటనే మార్కాపురం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేస్తామంటున్నారు. ఈ హామీ కూడా ఎన్నికల్లో ప్రభావం చూపించే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో వైసీపీ అభ్యర్థి కుందురు నాగార్జున రెడ్డిపై గిద్దలూరు వాసులు వ్యతిరేకతో ఉన్న మాట వాస్తవం. ఇందుకు కారణం స్థానికుడు కాదనే మాట. అలాగే టీడీపీ ప్రభుత్వ హాయంలో నిర్మించిన టిడ్కో ఇళ్లను ఈ ఐదేళ్లలో లబ్దిదారులకు అందించలేదు. ఇది కూడా టీడీపీకి అనుకూలమే. ఈ ఎన్నికల్లో ముత్తముల అశోక్ రెడ్డి వైసీపీకి గ‌ట్టి పోటీ ఇస్తాడంటున్నా గ‌త ఎన్నిక‌ల్లో వైసీపీకి వ‌చ్చిన 81 వేల మెజార్టీని దాటి ఎంత వ‌ర‌కు గెలుస్తాడు ? అనేది కూడా చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: