
ఇరాన్ ఎలా స్పందించబోతుందన్న విషయాన్ని అమెరికా బాగా గమనిస్తున్నదని వాన్స్ తెలిపారు. ఇరాన్ తమ అణ్వాయుధ కార్యక్రమాన్ని కొనసాగిస్తుందా? లేదా అమెరికా దళాలపై ప్రతిదాడికి దిగుతుందా? అన్న దానిపై తదుపరి 24 గంటల్లో స్పష్టత వస్తుందని వెల్లడించారు. ప్రస్తుత పరిస్థితులు చాలా సున్నితంగా ఉన్నాయని, ఇప్పటివరకు ఇరాన్ పరోక్ష హెచ్చరికలు మాత్రమే పంపించిందని చెప్పారు. అయితే హర్మూజ్ జలసంధిలో షిప్పింగ్‌కు ఇరాన్ ఆటంకం కలిగిస్తే పరిస్థితులు మరింత తీవ్రంగా మారుతాయని హెచ్చరించారు. అలాంటి చర్యలు ‘ఆత్మహత్య’ తరహాలో ఉంటాయని, వాటితో తమ సొంత ఆర్థిక వ్యవస్థను ఇరాన్ నాశనం చేసుకుంటుందని వాన్స్ అన్నారు.
ఈ దాడులపై ట్రంప్ కూడా సోషల్ మీడియా వేదికగా స్పందించారు. ఇక శాటిలైట్ చిత్రాలను పరిశీలిస్తే, ఇరాన్ లోని ప్రధాన అణు కేంద్రాలు తీవ్రంగా ధ్వంసమైనట్టు కనిపిస్తున్నాయి. తుడిచిపెట్టుకుపోయాయ్ అనడం సరైన పదమేమో..! తెల్లని నిర్మాణాలు శిథిలాలుగా మారిపోయాయి. భూగర్భంలోని ప్రధాన హంగులు నేలమట్టం అయ్యాయని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ఆదివారం తెల్లవారుజామున ఇరాన్‌లోని ఫోర్డో, నతాంజ్, ఇస్ఫహాన్ వంటి ప్రముఖ అణు కేంద్రాలపై దాడులు చేసింది. ఫోర్డో కేంద్రం 90 మీటర్ల లోతులో పర్వతాల అడుగున ఉండగా, అక్కడికి బీ2 బాంబర్లతో 14 బంకర్ బస్టర్ బాంబులు వేసినట్లు తెలుస్తోంది. శాటిలైట్ చిత్రాల్లో ఫోర్డో కేంద్ర ప్రవేశద్వారం పూర్తిగా ధ్వంసమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి. దాడుల అనంతరం ఆ ప్రాంతంలో దట్టమైన పొగలు అలుముకున్నాయి.
ఈ దాడులకు ప్రతిగా ఇరాన్ హర్మూజ్ జలసంధి మార్గాన్ని మూసివేసేందుకు సిద్ధమైంది. దీని వల్ల అంతర్జాతీయ షిప్పింగ్‌పై తీవ్ర ప్రభావం పడే అవకాశముందని, యుద్ధ పరిస్థితులు మరింత ఉద్రిక్తత తలెత్తే ప్రమాదముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలతో ప్రపంచవ్యాప్తంగా ఆందోళన వ్యక్తమవుతోంది. యుద్ధ విరమణ వైపు పయనించాల్సిన సమయంలో ఇలా పరిస్థితులు మళ్లీ వేడెక్కడం అంతర్జాతీయ శాంతికి సవాల్‌గా మారుతోంది.