
అయినప్పటికీ, అటువంటి ప్రమాదకర పరిస్థితులు నెలకొన్న దేశానికి వెళ్ళే తమ పౌరులకు 'అమెరికా వీధుల్లో ఒంటరిగా సంచరించకండి, ప్రాణాలకు ముప్పు' అంటూ మనదేశం ఎన్నడూ భయపెట్టలేదు, హితబోధలు చేయలేదు. అక్కడ వ్యాపారాలు స్థాపించాలనుకునేవారికి 'జాగ్రత్త సుమా, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అనిశ్చితి' అని హెచ్చరించిన పాపాన పోలేదు. ఇది మన సంస్కారం, మన హుందాతనం.
అయితే, బహుశా పొరుగుదేశపు పాకిస్థాన్ పైనున్న అపారమైన ప్రేమతోనో ఏమో, అగ్రరాజ్యం హఠాత్తుగా భారతదేశంలో మహిళలకు రక్షణ లేదని, మత ఘర్షణలు నిత్యకృత్యమని, కాబట్టి ప్రయాణాలు మానుకోవడమో, లేదంటే వెళ్ళేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించుకోవడమో చేయాలంటూ ఓ విచిత్రమైన సూక్తిముక్తావళిని వల్లించింది. తమ దేశంలోని అరాచకాన్ని కప్పిపుచ్చుకుంటూ, శాంతియుతమైన, అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న భారత్‌పై ఇలాంటి నిరాధారమైన ఆరోపణలతో విషం చిమ్మడం వారి ద్వంద్వ నీతికి నిదర్శనం.
మన దేశం వారి అంతర్గత వ్యవహారాల్లో తలదూర్చకుండా, వారి నేరాల చిట్టాను ప్రపంచం ముందు ఏకరువు పెట్టకుండా సంయమనం పాటించడమే, బహుశా వారి ఈ మితిమీరిన ధైర్యానికి, మనపై ఇలాంటి విషప్రచారానికి తెగించడానికి కారణమై ఉండొచ్చు. ఈ అవాస్తవపు ఆరోపణల వెనుకనున్న కుట్రను ఛేదించి, అగ్రరాజ్యపు అసలు స్వరూపాన్ని ప్రపంచానికి చాటిచెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మన మౌనం బలహీనత కాదని నిరూపించాలి. ఏది ఏమైనా అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న ఈ పరిణామాలు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాయి.