
అధికారులు ఛాలెంజ్ గా తీసుకుని వంద రోజుల్లో గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా మంగళగిరిని తీర్చిదిద్దాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆదేశించారు. స్వచ్ఛతలో మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పోరేషన్ ను నెం.1గా తీర్చిదిద్దేలా సుమారు రూ.4.40 కోట్ల విలువైన ఐదు అధునాతన వాహనాలను మంత్రి నారా లోకేష్ లాంఛనంగా ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు రెండు రిఫ్యూజ్ కాంపాక్టర్ మెషిన్ వాహనాలు, రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలతో పాటు బీటీ రహదారుల గుంతలు పూడ్చే అధునాతన పాత్ హోల్ రోడ్ రిపేర్ వాహనాన్ని ఉండవల్లి నివాసంలో మంత్రి నారా లోకేష్ జెండా ఊపి ప్రారంభించారు. చెత్తను తరలించేందుకు బెంగుళూరు, చెన్నై, హైదరాబాద్ వంటి నగరాల్లో వినియోగిస్తున్న రూ.1.91 కోట్ల విలువైన రెండు కాంపాక్టర్ వాహనాలు రాష్ట్రంలోనే మొదటిసారిగా మంగళగిరి నగరపాలక సంస్థకు అందుబాటులోకి వచ్చాయి.
ట్రాక్టర్లు, ఆటోల ద్వారా సేకరించిన వ్యర్థాలను ఈ కాంపాక్టర్ వాహనాల ద్వారా డంపింగ్ యార్డుకు తరలించనున్నారు. ఎంటీఎంసీ పరిధిలో బీటీ రోడ్లపై ఎప్పటికప్పుడు గుంతలు పూడ్చేందుకు రూ.1.48 కోట్ల విలువైన పాత్ హోల్ రిపేర్ వాహనంతో పాటు సుమారు రూ.1.2 కోట్ల విలువైన రెండు స్వీపింగ్ మెషిన్ వాహనాలు అందుబాటులోకి వచ్చాయి. స్వచ్ఛ మంగళగిరి సాధనకు ఈ అధునాతన వాహనాలు దోహదపడనున్నాయి. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ.. మంగళగిరిని గుంతలు లేని రోడ్లు ఉన్న నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు వంద రోజుల ఛాలెంజ్ ను అధికారులు స్వీకరించాలన్నారు. వంద రోజుల తర్వాత రోడ్లపై ఏమైనా గుంతలు ఉంటే వాట్సాప్ లేదా స్వచ్ఛాంధ్ర యాప్ ద్వారా ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేలా కసరత్తు చేయాలని ఆదేశించారు. మంత్రి లోకేష్ ఛాలెంజ్ ను తాము స్వీకరిస్తున్నామని, స్వచ్ఛతలో మంగళగిరిని నెం.1 తీర్చిదిద్దుతామని ఈ సందర్భంగా అధికారులు చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎంటీఎంసీ కమిషనర్ షేక్ అలీం బాషా, స్వచ్ఛాంధ్ర కార్పోరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరాం, ఏపీఎంఎస్ఐడీసీ ఛైర్మన్ చిల్లపల్లి శ్రీనివాసరావు, టీటీడీ బోర్డు మెంబర్ తమ్మిశెట్టి జానకీదేవి, గుంటూరు పార్లమెంట్ టీడీపీ ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి నియోజకవర్గ పరిశీలకులు ముమ్మడి సత్యనారాయణ, మంగళగిరి పట్టణ టీడీపీ అధ్యక్షులు పడవల మహేష్, ప్రధాన కార్యదర్శి షేక్ రియాన్, మంగళగిరి మండల టీడీపీ అధ్యక్షులు పల్లబోతుల శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి వెంకట్, తాడేపల్లి పట్టణ టీడీపీ అధ్యక్షులు వల్లభనేని వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి దారా దాసు, తాడేపల్లి రూరల్ టీడీపీ అధ్యక్షులు దాసరి కృష్ణ, ప్రధాన కార్యదర్శి కొల్లి శేషు, ఎంటీఎంసీ ఎస్ఈ శ్రీనివాసరావు, డీఈ రాము తదితరులు పాల్గొన్నారు.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు