కేసీఆర్ కుమార్తె, మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఇటీవల ఒక యూట్యూబ్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో కలకలం సృష్టిస్తున్నాయి. ముఖ్యంగా తన మేనమామ, మాజీ మంత్రి హరీష్ రావుపై ఆమె చేసిన తీవ్ర వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.

ఆ ఇంటర్వ్యూలో కవిత మాట్లాడుతూ, దివంగత ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును నారా చంద్రబాబు నాయుడు వెన్నుపోటు పొడిచిన తరహాలోనే, భవిష్యత్తులో కేసీఆర్‌ను ఆయన మేనల్లుడు హరీష్ రావు కూడా వెన్నుపోటు పొడిచే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్య చేశారు. బీఆర్ఎస్ పార్టీకి ఏనాటికైనా హరీష్ రావు వల్ల ముప్పేనని ఆమె అభిప్రాయపడ్డారు. హరీష్ రావు కేసీఆర్ క్షేమాన్ని కోరుకునే వ్యక్తి అని తాను అనుకోవడం లేదని కవిత స్పష్టం చేశారు.

అయితే, కేసీఆర్ చుట్టూ ఉన్న 'దెయ్యాలలో' తన సోదరుడు, మాజీ మంత్రి కేటీఆర్ లేరని ఆమె తెలిపారు. తన మనసు విరిగిపోయిందని, ప్రస్తుతానికి బీఆర్ఎస్ పార్టీలోకి తిరిగి వెళ్లే పరిస్థితి అయితే లేదని ఆమె స్పష్టం చేశారు. భవిష్యత్తులో తన ముందు ఎవరున్నా తాను పోరాటం చేస్తానని కవిత ధీమా వ్యక్తం చేశారు.

జర్నలిస్ట్ తీన్మార్ మల్లన్న తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినప్పుడు, అప్పటి పార్టీ అధ్యక్షులు కేసీఆర్, కేటీఆర్ స్పందించకపోవడం తనను ఎంతో బాధించిందని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తాను పార్టీ కోసం ఎంతో కృషి చేసినా, కష్టకాలంలో తనకు మద్దతు లభించలేదన్న అంతరంగాన్ని ఆమె వెల్లడించారు. బీఆర్ఎస్‌లో తనతో పాటు చాలామందికి అన్యాయం జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు. ఈ వ్యాఖ్యలు బీఆర్ఎస్ అంతర్గత రాజకీయాలపై కొత్త చర్చకు దారి తీయడమే కాకుండా, కవిత రాజకీయ భవిష్యత్తుపై అనేక ఊహాగానాలకు తెర తీశాయి. కవిత తదుపరి అడుగులు ఏ విధంగా ఉండబోతున్నాయన్నది ఆసక్తికరంగా మారింది. కవిత చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి.



మరింత సమాచారం తెలుసుకోండి: