ఇక అదేవిధంగా పార్టీ కార్యకర్తలతో మమేకం అవ్వడంలో కొంత వెనుకబడి ఉన్నారన్న అభిప్రాయం కూడా టిడిపి వర్గాల్లో వ్యక్తమవుతోంది. ముఖ్యంగా, ప్రజా సమస్యలపై స్పందించడంలో ఆలస్యం అవుతోందన్న ఆవేదన కనిపిస్తోంది. ఇదే సమయంలో మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ స్థానికంగా మళ్లీ చురుకుగా వ్యవహరిస్తుండడం కూడా పార్టీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. పార్టీ కార్యకర్తలు కార్యక్రమాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తే, ఎంఎల్ఏ సమయం కేటాయించలేకపోవడం వల్ల నిరుత్సాహం పెరుగుతోందని అంటున్నారు. ఈ పరిస్థితులను వైసీపీ మాత్రం బలంగా ఉపయోగించుకుంటోందని స్థానిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. అయితే సురేంద్రబాబు మాత్రం తమకు ఎదురవుతున్న విమర్శలపై స్పష్టమైన సమాధానం ఇస్తున్నారు.
ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల మధ్యకు తీసుకెళ్లడంలో, నియోజకవర్గ అభివృద్ధిలో తాము వెనుకడుగు వేయడం లేదని స్పష్టం చేస్తున్నారు. వ్యాపారబాధ్యతల కారణంగా కొన్ని సందర్భాల్లో అందుబాటులో లేకపోయినా, ప్రజల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యం లేదని చెబుతున్నారు. పార్టీ కార్యకర్తల వాదన ప్రకారం, సురేంద్రబాబు ప్రజలతో నేరుగా మమేకం అయ్యే కార్యక్రమాలను పెంచితేనే రాజకీయ పట్టు బలపడుతుందంటున్నారు. కొంతమంది నేతలు పదవుల విషయంలో పట్టింపులేమీ లేవని, సిఫార్సులు రాకపోవడమే విభేదాలకు దారితీస్తోందని అంటున్నారు. మొత్తానికి కళ్యాణదుర్గం రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. సురేంద్రబాబు కొంత సర్దుబాటు చేసుకుంటే పరిస్థితులు పార్టీకి అనుకూలంగా మారవచ్చు. లేకపోతే, విభేదాలు పెరిగి వైసీపీకి లాభం చేకూర్చే అవకాశం ఉందని విశ్లేషకుల అంచనా.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి