తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ఏపి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నివాసమైన లింగమనేని ఎస్టేట్ వద్ద ప్రస్తుతం ఉద్రిక్తకరమైన పరిస్థితులు నెలకొన్నాయి.  బాబు నివాసంపై అనుమానిత డ్రోన్ తిరగడంతో సెక్యూరిటీ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేశారు.  దీనిపై బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.  హై సెక్యూరిటీ జోన్ పరిధిలోకి డ్రోన్ లను ఎలా అనుమతిస్తారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  



డ్రోన్ వీడియోను ఎందుకు తీయాల్సి వచ్చిందో చెప్పాలని అయన ఏపి డిజిపి సవాంగ్ కు ఫోన్ చేశారు.  దీనిపై అయన వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.  అటు ఇరిగేషన్ శాఖ ఈ డ్రోన్ వీడియోపై స్పందించింది.  ఎగువ నుంచి వరద నీరు ఉదృతంగా ప్రవహిస్తోందని, కరకట్టపై ఏ మేరకు నీరు వచ్చిందో తెలుసుకోవడానికి డ్రోన్ ను వినియోగించినట్టు చెప్పింది.  


డ్రోన్ వీడియో ద్వారా మిగతా ప్రాంతాలను కూడా వీడియో తీసినట్టుగా ఇరిగేషన్ శాఖ తెలిపింది.  సెక్యూరిటీ జోన్ అయినప్పటికీ అత్యవసర పరిస్థితుల కారణంగా డ్రోన్ ను వినియోగించి వీడియో తీసినట్టు సమాచారం.  దీనిపై తెలుగుదేశం పార్టీ ఆగ్రహం వ్యక్తం చేసింది.  హుటాహుటిన బాబు నివాసం వద్దకు తెలుగుదేశం పార్టీ నాయకులూ చేరుకున్నారు.  


బాబు ఇంటిపై డ్రోన్ వీడియోను ఎలా అనుమతిస్తారని అక్కడి పోలీసులను నిలదీశారు.  దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. ఇదిలా ఉంటె, తెలుగుదేశం పార్టీ నేతలు బాబు నివాసంపై డ్రోన్ ను ప్రయోగించిన కొంతమంది వ్యక్తులను పట్టుకున్నారు. వారిని నిలదీశారు.  ఇరిగేషన్ శాఖ అనుమతితోనే ఈ డ్రోన్ వీడియోను తీసినట్టు వారు పేర్కొన్నారు.  చంద్రబాబు నివాసానికి చేరుకున్న  తెదేపా నేతలు దేవినేని అవినాష్‌, ఎమ్మెల్సీ టీడీ జనార్దన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు నిజాలు కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తున్నారంటూ ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో తెదేపా నేతలు పోలీసు జీపును చుట్టుముట్టారు. జడ్‌ ప్లస్‌ భద్రత ఉన్న చంద్రబాబు నివాసంపైకి డ్రోన్‌ ప్రయోగించడానికి గల కారణాలను తమకు తెలపాల్సిందేనంటూ పట్టుబట్టారు.


మరింత సమాచారం తెలుసుకోండి: