పిట్టపోరు..పిట్ట పోరు పిల్లి తీర్చిందని ఓ సామెత. ఇప్పుడు ఈ సామెత సరిగ్గా సరిపోకపోయినా తమిళనాట రాజకీయ పరిస్థితి ఇలాగే తయారయ్యింది. నిన్నమొన్నటి వరకూ శశికళ, పన్నీర్ సెల్వం నువ్వా నేనా అన్నట్టు సీఎం కుర్చీ కోసం పోటీ పడ్డారు. ఇప్పుడు సుప్రీంకోర్టు తీర్పుతో అనూహ్యంగా పళనిస్వామి తమిళనాడు సీఎం అయ్యారు. 

ఇంతకీ ఈ పళని స్వామి ఎవరు.. ఆయన బ్యాక్ గ్రౌండ్ ఏంటి ఓ సారి పరిశీలిద్దాం.. పళని స్వామి సేలం జిల్లాలోని ఓ రైతు కుటుంబం నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఎంజీఆర్‌ మరణానంతరం అన్నాడీఎంకే చీలిక వచ్చినప్పుడు జయలలితకు దన్నుగా నిలిచారు. 1989లో జయలలిత వర్గం నుంచి ఎడప్పాడి నుంచి గెలిచారు. ఆ తర్వాత 1991, 2011, 2016 ఎన్నికల్లోనూ ఇదే నియోజకవర్గం నుంచి గెలుపొందారు.



2011లో జయలలిత మంత్రివర్గంలో రహదారుల శాఖ మంత్రిగా పనిచేసిన పళనిస్వామి.. 2016లో ప్రజాపనుల శాఖ మంత్రిగా నియమితులయ్యారు. జయలలిత మంత్రివర్గంలోని సీనియర్లలో పళనిస్వామి ఒకరు. అసలు జయ మొదటిసారి కుర్చీ అప్పగించాల్సి వచ్చినప్పుడు పన్నీర్ సెల్వం కంటే ముందే పళనిస్వామి అనుకున్నారట. కానీ ఒకరిద్దరు వ్యతిరేకించడంతో ఎలాంటి వ్యతిరేకత లేని పన్నీర్ కు అవకాశం దక్కిందట.  

ఐతే.. పళని స్వామికి రాజకీయంగా అంత మంచి పేరు లేదు. అవినీతి పరుడు అన్న ముద్ర ఉంది. తాజాగా నోట్ల రద్దు కుంభకోణంలో స్వయంగా ఆయన కుమారుడు చిక్కుకుని ప్రస్తుతం జైల్లో ఉన్నాడు. అవినీతి పరురాలైన శశికళ.. తన ప్రతినిధిగా కూడా తనకు తగిన వాడినే ఎంచుకుందన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మరి పళనిస్వామి ఏలుబడి ఎలా ఉంటుందో చూడాలి.  



మరింత సమాచారం తెలుసుకోండి: