ప్రభుత్వ ఆఫీసుల్లో చాలామంది లంచాలకు మరుగుతారు. లంచాలు తీసుకొని ఎవరికోసం ఏ పని చేయడానికి సిద్ధమవుతారు. అయితే ఇటీవల ప్రలోభాలకు లొంగని ఓ స్ట్రిక్ట్ ఆఫీసర్ సోషల్ మీడియాలో వైరల్ గా మారారు. కాకపోతే ఆ ఆఫీసర్ మనిషి కాదు, కోతి. వినడానికే నవ్వొస్తుంది కదూ. నిజంగానే ఈ కోతి ఒక ఆఫీసర్ అవతారం ఎత్తింది. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో, ఒక కోతి ఒక అధికారి కుర్చీలో కూర్చుని, ఆయన ముందు ఉన్న పేపర్లను జాగ్రత్తగా తిప్పుతూ ఉంటుంది.

ఆ సమయంలో, కార్యాలయంలో ఉన్న ఉద్యోగులు అందరూ ఆ కోతిని చూస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగులు ఆ కోతిని కుర్చీ నుండి తీసి, దానికి ఒక అరటిపండు ఇవ్వడానికి ప్రయత్నిస్తారు. కానీ, ఆ కోతి అరటిపండు వైపు కూడా చూడదు. అది పేపర్లను తిప్పుతూనే ఉంటుంది. ఆ తర్వాత, మళ్ళీ ఉద్యోగులు అరటిపండు తొక్క తీసి, ఆ కోతి వైపు పట్టుకుంటారు. కానీ, ఈ సారి కూడా ఆ కోతి అరటిపండు తీసుకోకుండా, ఒక సీరియస్ అధికారి వలె పేపర్లను తిప్పుతూనే ఉంటుంది.

సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న ఈ కోతి వీడియో గురించి అధికారులు మాట్లాడారు. ఆ వీడియో నిజమే అని, అది బెహత్ తహసీల్ ఆఫీసు రిజిస్ట్రేషన్ విభాగంలో జరిగిందని చెప్పారు. సబ్-కలెక్టర్ దీపక్ కుమార్ ఈ వీడియో తహసీల్ ఆఫీసులోనే తీసినదని చెప్పారు. కోతి కొంతసేపు ఆఫీసులో కూర్చుని ఉండి, తనంతట తాను బయటకు వెళ్ళిపోయింది. అది ఏ పేపర్‌కీ నష్టం చేయలేదని కూడా చెప్పారు.

ఆయన మరో విషయం కూడా చెప్పారు. ఆ ఆఫీసు ప్రాంతంలో అప్పుడప్పుడు కోతులు వస్తూ ఉంటాయని, కానీ ఇలా ఆఫీసు లోపల కుర్చీలో కూర్చోవడం మొదటిసారి జరిగిందని తెలిపారు.



 రీసెంట్ గా ఈ వీడియోను ఏసీబీ డీజీ సీవీ ఆనంద్ షేర్ చేశారు. "అవినీతి అధికారులను పట్టుకునే పనిలో నుంచి కొంచెం విరామం తీసుకున్న, ఈ అధికారిని చూడండి. ఈ ఆఫీసర్ రికార్డులను చాలా జాగ్రత్తగా పరిశీలిస్తున్నారు. ఎవరైనా లంచం ఇవ్వాలని ప్రయత్నిస్తే వెంటనే తిరస్కరిస్తున్నారు. ఎటువంటి ప్రలోభాలకు లొంగకుండా విచారణ చేస్తున్న స్ట్రిక్ట్ అధికారి" అని ఒక క్యాప్షన్ కూడా జోడించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: