ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క నిర్ణ‌యం తీసుకోనున్న‌ట్లు తెలుస్తోంది. ఇటీవ‌లి ఎన్నిక‌ల్లో ఘోర ప‌రాజ‌యం నేప‌థ్యంలో...శాస‌న‌స‌భాప‌క్ష నేత‌గా ప‌నిచేసేందుకు సిద్ధంగా లేని సంగ‌తి తెలిసిందే. ఇదే విషయాన్ని ఇప్ప‌టికే ఆయ‌న వెల్ల‌డించారు. ఈ నేప‌థ్యంలో..కొత్త ఎల్పీ నేత ఎవ‌ర‌నే చ‌ర్చ స‌హ‌జంగానే తెర‌మీద‌కు వ‌స్తుంది. దీనికి స‌మాధానం దొరికింది. తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్ష నేతగా మాజీ మంత్రి, టెక్కలి ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పేరు దాదాపుగా ఖరారు అయినట్లు విశ్వసనీయ సమాచారం. 


ఎర్ర‌న్నాయుడుకు ఈ ప‌ద‌వి క‌ట్ట‌బెట్ట‌డం వెనుక లెక్క‌లు వేరేన‌ని అంటున్నారు. ఈ సార్వత్రిక ఎన్నికల్లో స్వర్గీయ కింజరపు ఎర్రన్నాయుడు కుటుంబం నుంచి ముగ్గురు చట్టసభలకు ఎన్నిక అయిన సంగ‌తి తెల‌సిందే. శాసనసభకు అచ్చెన్నాయుడుతో పాటు, అన్న ఎర్ర‌న్నాయుడు కుమార్తె రాజ మండ్రి అర్భన్‌ నుంచి ఆదిరెడ్డి భవానీ ఎన్నికయ్యారు. అలాగే, శ్రీకాకుళం ఎంపీగా రెండోసారి రామ్మోహన్‌నాయుడు ఎన్నికయ్యారు. దీంతో ఒకే కుటుంబం నుంచి ముగ్గురు తెలుగుదేశం పార్టీ తరపున ఎన్నిక కావడం కూడా అచ్చెన్నాయుడుకు కలిసి వచ్చిన అంశంగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. 


టీడీపీ శాసనసభ పక్ష సమావేశం రేపు జరగనుంది. ఈ సమావేశంలో శాసనసభ పక్ష నేతను ఎన్నుకోనున్నారు. ప్రస్తుత రాష్ట్ర రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ఈ బాధ్యతలను స్వీకరించే ఆలోచనలో లేనట్లు సమా చారం. ఈ నేపథ్యంలో ఆ బాధ్యతలను మంచి వాగ్ధాటి కలిగిన నేతగా పేరున్న అచ్చెన్నాయుడుకు అప్పగించాలని అధినేత చంద్రబాబు నిర్ణయించినట్లు తెలిసింది.

గ‌త అసెంబ్లి సమావేశాలలో అనర్గళంగా తన గళాన్ని వినిపించడంతో పాటు, విపక్ష వైకాపా, బీజేపీలపై తీవ్ర స్థాయిలో విరుచుపడి అధినేత చంద్రబాబునాయుడు ప్రశంసలు సైతం అందుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ పదవికి సరైన వ్యక్తిగా అచ్చెన్నాయుడును చంద్రబాబునాయుడు ఎంపిక చేసినట్లు సమాచారం. విప‌క్ష నేత‌గా త‌న‌దైన శైలిలో ఎర్ర‌న్నాయుడు విరుచుకుప‌డనున్న‌ట్లు ప‌లువురు అంచ‌నా వేస్తున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: