
కోటగిరి రూటు – ప్రభావం తక్కువేం కాదు! :
కోటగిరి శ్రీధర్ పేరు వినగానే ఏలూరు పరిధిలో గుండెల్లో గుబులు వొస్తుంది. ఆయన తండ్రి కోటగిరి విద్యాధరరావు – చంద్రబాబుకు అత్యంత సన్నిహితులు, టీడీపీలో మంత్రిగా ఎన్నో కీలక శాఖలు చూసిన ఘనత ఆయనది. అలాంటి నాయకుడి వారసుడిగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన శ్రీధర్, టీడీపీ బాట పట్టకుండా వైసీపీ తలుపుతట్టారు. 2019లో ప్రజల కోపం, జగన్ గాలితో కలసి ఏలూరు ఎంపీగా గెలిచారు. సామాజికంగా బలమైన వర్గానికి చెందిన ఆయనకు, ప్రజల్లో కూడా మంచి ఇమేజ్ ఉంది. కానీ ఆ గెలుపు అనంతరం విషయాలు క్రమంగా మారిపోయాయి.
పార్టీలో నిర్లక్ష్యం.. పక్కదారి చూస్తున్న నేత! :
ఎంపీ అయ్యాక కొంతకాలం తన నియోజకవర్గంలో చురుకుగా కదలికలు ఉన్నా, కొన్నాళ్లకు ఆయన్ను పక్కన పెట్టినట్లుగా వ్యవహరించారని ప్రచారం. ఆయన ప్రాంతంలో ఇతర నేతల జోక్యం, అధికారం చుట్టూ తిరిగే రాజకీయాలు కోటగిరిని విసిగించాయని అంటున్నారు. టికెట్ విషయంలో పార్టీ ఆయనకు స్పష్టత ఇవ్వకపోవడం, సీనియారిటీని గౌరవించకపోవడం వల్ల ఆయనే స్వయంగా “నాకు టికెట్ వద్దు” అని చెప్పేశారట. ఈ వ్యవహారాలన్నింటి తాలుకూ ఫలితం – 2024లో వైసీపీ ఏలూరు సీటు కోల్పోయింది.
జనసేన వైపు చూపు:
ప్రస్తుతం కోటగిరి శ్రీధర్ తన వ్యాపారాల నిమిత్తం అమెరికాలో ఉన్నారని చెబుతున్నారు. అయితే ఆయన రాజకీయాలకు దూరంగా ఉండరనే సంకేతాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి. తన అనుచరులను మెల్లగా జనసేనలోకి పంపిస్తున్నారని టాక్ నడుస్తోంది. సరైన సమయం చూసి ఆయన కూడా జనసేనలో చేరడం ఖాయమని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. టీడీపీలో ఇప్పటికే చాలా మంది సీనియర్ నాయకులు ఉండడం, అక్కడ తనకు పెద్దగా అవకాశం లభించకపోవచ్చని భావించి ఆయన జనసేన వైపు చూస్తున్నారని అంటున్నారు. ఈ దిశగా ఆయన ఇప్పటికే తన కార్యాచరణను సిద్ధం చేసుకుంటున్నారని చెబుతున్నారు.
గోదావరి జిల్లాలో వైసీపీకి నష్టం తప్పదా? :
కోటగిరి శ్రీధర్ ఇప్పటివరకు అధికారికంగా వైసీపీకి రాజీనామా చేయలేదు. కానీ ఆయన మానసికంగా పార్టీకి దూరమయ్యారని అంటున్నారు. అందుకే ఆయన వర్గం మొత్తం జనసేనలోకి వెళ్లడం ప్రారంభమైంది. ఆయన వైసీపీలో కొనసాగే అవకాశాలు లేవని, సరైన సమయం చూసి వైసీపీకి గుడ్ బై చెప్పి జనసేనలో చేరతారని అంటున్నారు. ఒక బలమైన రాజకీయ కుటుంబం నుంచి వచ్చిన, వివాదరహితుడిగా పేరున్న కోటగిరి శ్రీధర్ లాంటి నాయకులు వైసీపీని వీడితే గోదావరి జిల్లాల్లో పార్టీకి భారీ నష్టం తప్పదని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఈ పరిణామాలు వైసీపీకి మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో ఆయన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.