అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి భారత్ ఎగుమతి రంగానికి షాకిచ్చారు. ఇప్పటికే అమల్లో ఉన్న 25 శాతం టారిఫ్‌లపై మరో 25 శాతం అదనంగా విధిస్తూ ఇటీవల ప్రకటించిన కొత్త సుంకాల నిర్ణయం, భారత దిగుమతి వ్యాపారాన్ని గందరగోళంలోకి నెట్టేసింది. ముఖ్యంగా టెక్స్‌టైల్, దుస్తులు, తోలు ఉత్పత్తులు, ఫ్యాషన్ రంగాల్లో ఈ ప్రభావం తీవ్రమైంది. అమెజాన్, వాల్‌మార్ట్, టార్గెట్, గ్యాప్ లాంటి అమెరికన్ దిగ్గజ రిటైల్ సంస్థలు భారత టోకు వ్యాపారులకు మెయిల్స్ పంపించి, తమ స్టాక్ ఆర్డర్లను తాత్కాలికంగా నిలిపేశాయి. “ఇంకా ఆర్డర్లు పెట్టే పరిస్థితి లేదు, కొత్త మార్గదర్శకాలు వచ్చేవరకు ఎగుమతులు నిలిపేయండి” అంటూ స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి.
 

దీంతో వేల్‌స్పన్ లివింగ్, ట్రైడెంట్, ఇండోకౌంట్ వంటి దిగ్గజ ఎగుమతి సంస్థలే కాదు, చిన్న ఎగుమతిదారులు కూడా పెద్ద షాక్లో పడ్డారు. ఆగస్టు 27 నుంచి మొత్తం 50 శాతం టారిఫ్‌లు అమలులోకి రానున్నాయి. దీని వల్ల అమెరికాలో భారత్ తయారు చేసిన వస్త్రాల ధరలు 30 నుంచి 35 శాతం పెరగనున్నాయి. ఇదే విషయాన్ని రిటైల్ సంస్థలు చెబుతున్నాయి – “ఈ ఖర్చును మీరు (ఇండియా ఎగుమతిదారులే) భరించాలి” అని! దాంతో ఇప్పటికే కొన్ని ఒప్పందాలు క్యాన్సిల్ అయ్యాయి. ఇక ఈ పరిణామాలు మామూలుగా ఉన్నా, దాదాపు రూ.4-5 బిలియన్ డాలర్ల నష్టం వాటిల్లే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.



గత ఆర్థిక సంవత్సరంలో భారత్ టెక్స్‌టైల్ రంగం నుంచి 36.61 బిలియన్ డాలర్ల ఎగుమతులు జరగగా, 28 శాతం అమెరికా మార్కెట్‌ నుంచే వచ్చాయి. అంటే చెప్పడానికే కాదు.. ఆర్థికంగా నిజంగానే అమెరికా పై ఆధారపడిన రంగం ఇది. కానీ తాజా పరిణామాలతో అమెరికా కంపెనీలు బంగ్లాదేశ్, వియత్నాం వంటి ప్రత్యామ్నాయ మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నాయి. ట్రంప్ ప్రకటించిన ఈ కొత్త టారిఫ్ విధానాలు వాడి స్టైల్ అనిపించుకోవచ్చు, కానీ భారత్ ఎగుమతి రంగానికి మాత్రం భయంకరమైన బురద తవ్వినట్టే అయ్యింది. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఈ బలమైన షాక్ నుంచి ఎలా బయటపడుతుంది? ట్రేడ్ డిప్లొమసీలో ఎలాంటి మెరుపులు చూపిస్తుంది? అన్నదే ఆసక్తికరంగా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: