తెలంగాణ ఎన్నికల ప్రకటన రానే వచ్చింది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాల్లోను ఎన్నికల నగారా మోగింది. మరో రెండు నెలల్లో తెలంగాణలో కొత్త ప్రభుత్వం ఏర్పాటుకానుంది. ఈ మేరకు ఎన్నికల్లో గెలిచేందుకు అన్ని పార్టీలు సర్వశక్తులూ ఒడ్డుతున్నాయి. అయితే ఏ పార్టీ అధికారం చేపడుతుంతో అని పలు సంస్థలు సర్వేలు చేసి తమ నివేదికలను బహిర్గతం చేస్తూ పొలిటికల్ హీట్ ను పెంచుతున్నాయి.


నిన్న మొన్నటి వరకు బీఆర్ఎస్ కు అనుకూలంగా ఉన్న వాతావరణం ఇప్పుడు కాంగ్రెస్ వైపు మళ్లింది. తాజాగా భారత్ పొలిటకల్ రీసెర్చ్ అండ్ ఎనాలసిస్ సెంటర్ పేరుతో జరిపిన సర్వేలో తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రానుందని పేర్కొంది. కాంగ్రెస్ పార్టీకి 65-72 స్థానాలు వస్తాయని ఆ సంస్థ తమ సర్వేలో వెల్లడించింది. 48.43 శాతం ఓట్లు సాధిస్తుందని అంచనా వేసింది. ప్రస్తుతం అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి 35-40 స్థానాలతో గద్దె దిగుతుందని.. ఆ పార్టీకి 36.87 శాతం ఓట్లు వస్తాయని పేర్కొంది.


గతంలో కాంగ్రెస్ కు 28.43 శాతం ఓట్లు రాగా ఈసారి 48.43 శాతం ఓట్లకు ఎగబాకింది. దాదాపు ఆ పార్టీకి 20శాతం ఓటింగ్ పెరుగుతుంది అని అంచనా వేస్తోంది. గతంలో టీఆర్ఎస్(ప్రస్తుత బీఆర్ఎస్) కు 46.87 శాతం ఓట్లు రాగా  ఈసారి తమ ఓట్లను గణనీయంగా కోల్పోతుందని  వివరించింది. అలాగే మిగతా పార్టీలకు సంబంధించి ఓట్లు శాతం కూడా తగ్గే అవకాశం ఉందని తమ సర్వేలో వెల్లడించింది.


బీజేపీ 7 శాతం నుంచి 2.98 శాతానికి పడిపోతుందని.. సీట్ల సంఖ్య కూడా 1-2కే పరిమితమవుతుంది.  ఎంఐఎం కు ఓటు బ్యాంకు మాత్రం అలాగే ఉంటుందని తెలిపింది. గతంలో టీడీపీకి 3.51 శాతం ఓట్లతో రెండు సీట్లు గెలుచుకోగా ఈసారి 3శాతం ఓట్లతో సీట్లేవీ రావని చెప్పింది.  ఈ ఊపును ఇలాగే కొనసాగించి కాంగ్రెస్ అధికారం చేపడుతుందా లేదా అనేది వేచి చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: