తన తొలగింపుపై ఎన్నికల కమీషన్ మాజీ కమీషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోర్టులో వేసిన రిప్లై కౌంటర్ లో పసలేదని తేలిపోయింది.  పైగా తాను చేసిన తప్పులను తాను రిప్లై కౌంటర్లో అంగీకరించినట్లే అని రాజకీయ విశ్లేషకులు అనుకుంటున్నారు.  ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్నికలను ఏకపక్షంగా వాయిదా వేయటాన్ని సమర్ధించుకుంటున్న తీరులోనే డొల్లతనం కనిపిస్తోంది. తన రిప్లైలో ఒకచోటేమో ఎన్నికల వాయిదా వేయాలన్న నిర్ణయం అంతా రహస్యమన్నాడు. తాను ఎవరితో చర్చించాల్సిన అవసరం కూడా తనకు లేదన్నాడు.

 

అదే రిప్లైలో ఎన్నికల వాయిదా విషయంలో కేంద్రంతో చర్చించినట్లు మళ్ళీ నిమ్మగడ్డే చెప్పుకున్నాడు. ఎన్నికల వాయిదా విషయాన్ని ఎవరితోను చర్చించాల్సిన అవసరం లేకపోతే మరి కేంద్రంతో మాత్రం ఎందుకు చర్చించినట్లు ?  ఎన్నికల నిర్వహణ అయినా వాయిదా అయినా జనాలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన విషయం. ఇందులో రహస్యమేమీ ఉండదు. ఎన్నికలు నిర్వహించే  ముందు అన్నీ రాజకీయ పార్టీలతో సమావేశమయ్యాడు కదా. మరి వాయిదా వేసేటపుడు పార్టీలతో చర్చించాల్సిన అవసరం లేదా ? కనీసం ప్రభుత్వంతో కూడా చర్చించకుండానే ఎన్నికలను వాయిదా ఎలా వేస్తాడు ?

 

షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు  నిర్వహించటం ప్రభుత్వం బాధ్యత. ఆ విషయంలో ప్రభుత్వం అన్నీ ఏర్పాట్లు చేసి తర్వాత విషయాన్ని ఎన్నికల కమీషన్ కు వదిలిపెట్టేయాలి. అప్పుడు ఎన్నికల నిర్వహణ తేదీలను కమీషన్ ప్రకటిస్తుంది. ఒకవేళ షెడ్యూల్ లో మార్పులుంటే కమీషనర్ కచ్చితంగా ప్రభుత్వానికి చెప్పాల్సిందే. ఎందుకంటే షెడ్యూల్ లో మార్పులు, చేర్పుల ప్రకారం శాంతి భద్రతలను, సిబ్బంది వ్యవహారాలను చూసుకోవాల్సింది ప్రభుత్వమే కాబట్టి. ఇంతటి కీలక విషయాన్ని నిమ్మగడ్డ అంతా రహస్యమని తాను ఎవరితోను చర్చించాల్సిన అవసరం లేదని వాదిస్తున్నాడంటే అనుమానించాల్సిందే.

 

ఇక ఎంపిటిసి, జడ్పిటిసి ఏకగ్రీవాలపైన కూడా నిమ్మగడ్డ విచిత్రమైన వాదన తెచ్చాడు. ఎంపిటిసి, జడ్పిటిసిలు ఎక్కువగా ఏకగ్రీవమయ్యాయి కాబట్టి ధౌర్జన్యాలు జరిగిందని చెప్పటమే విచిత్రంగా ఉంది. 2014లో జరిగిన ఎన్నికలకు, తాజా ఎన్నికలకు నిమ్మగడ్డ పోలికపెట్టటమే ఆశ్చర్యంగా ఉంది. 2014లో వైసిపి, టిడిపి రెండు ప్రతిపక్షాలే. కానీ ఇపుడు వైసిపి అధికారంలో ఉంది. అందులోను పదిమాసాల క్రితమే అఖండ మెజారిటితో అధికారంలోకి వచ్చింది. వైసిపికి వచ్చిన మెజారిటి చూసిన తర్వాత ప్రస్తుత ఎన్నికల్లో అధికారపార్టీకి వ్యతిరేకంగా పోటి చేయటానికి టిడిపి నేతలే చాలామంది ముందుకు రాలేదు.

 

స్ధానిక సంస్ధల ఎన్నికల్లో పోటి చేయమని తమ్ముళ్ళని టెలికాన్ఫరెన్సులో చంద్రబాబు బతిమలాడుకోవటమే ఇందుకు నిదర్శనం. అనంతపురంలో మాజీ ఎంపి జేసి దివాకర్ రెడ్డే  కాడి దింపేసిన తర్వాత మిగిలిన జిల్లాల్లో నేతల పరిస్ధితేంటో అర్ధమవుతోంది. చంద్రబాబు పుట్టి పెరిగిన నియోజకవర్గం చంద్రగిరిలోనే పార్టీ తరపున నామినేషన్లు వేయటానికి నేతలెవరూ ముందుకు రాలేదు కాబట్టే ఎంపిటిసి, జడ్పిటిసిలు ఏకగ్రీవమయ్యాయి. ఇదే పరిస్ధితి రాష్ట్రమంతా కనిపించింది కాబట్టే ఏకగ్రీవాలు ఎక్కువగా కనిపించటంలో ఆశ్చర్యం ఏమీలేదు.

 

నిజానికి స్ధానిక సంస్ధల పదవీకాలం షెడ్యూల్ అయిపోయే ముందే ఎన్నికల నిర్వహణపై కమీషనర్ ప్రభుత్వాన్ని హెచ్చరించాలి. 2018 ఆగస్టులోనే షెడ్యూల్ ముగిసినా నిమ్మగడ్డ ప్రభుత్వాన్ని హెచ్చరించలేదు. తర్వాత సుప్రింకోర్టు ఎన్నికలను నిర్వహించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయినా చంద్రబాబునాయుడు ఎన్నికల నిర్వహణకు ముందుకురాలేదు. అప్పుడు కూడా నిమ్మగడ్డలో చలనం కనబడలేదు. అలాంటిది ఎన్నికలను వాయిదా వేయటం రహస్యమని, తన విచక్షణ మేరకే జరిగిందని చెప్పటం చాలా విడ్డూరంగా ఉంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: