ఏపీలో అత్యాచారాలు పెరుగుతున్నాయి.. ఈ ప్రభుత్వం మహిళలను కాపాడలేకపోతోంది.. ఇదీ ఇటీవల తరచూ టీడీపీ మహిళా నేతలు చేస్తున్న విమర్శలు.. అందుకు విరుగుడుగా వారు ఓ ప్రతిపాదన చేస్తున్నారు. రాష్ట్రంలో మహిళలు తమకు తాము రక్షించుకునేందుకు గన్ లైసెన్స్ ఇవ్వాలని తెలుగు మహిళా రాష్ట్ర అధ్యక్షురాలు వంగలపూడి అనిత డిమాండ్‌ చేస్తున్నారు. జగన్ రెడ్డి పాలనలో ఊరికో ఉన్మాది తయారవుతున్నాడని.. వారి నుంచి కాపాడుకోవాలంటే తమకు తుపాకీల లైసెన్సులు కావాలాని వంగలపూడి అనిత అంటున్నారు.


జగన్ రెడ్డి పాలన రేపుల రాజ్యoగా మారిందని టీడీపీ మహిళా నేతలు మండిపడుతున్నారు. కీచకులు చిన్నా పెద్దా తేడా లేకుండా అఘాయిత్యాలకు పాల్పడుతున్నా.. ప్రభుత్వంలో చలనం లేదని దుయ్యబట్టారు. జగన్ రెడ్డికి తగ్గట్లుగానే పోలీసుల తీరూ ఉందని వంగలపూడి అనిత  విమర్శించారు. మహిళా సాధికారతలో రాష్ట్రాన్ని చంద్రబాబు మొదటి స్థానంలో నిలిపితే, లైంగిక వేధింపుల్లో జగన్ రెడ్డి ఏపీని అగ్రభాగాన నిలిపారని వంగలపూడి అనిత అన్నారు.


అసెంబ్లీలో మహిళా భద్రతకు తీసుకునే చర్యలు తీసుకోకపోగా ప్రతిపక్ష నేతల కుటుంబసభ్యుల్ని కించపరిచే వేదికగా మార్చారని వంగలపూడి అనిత ఆక్షేపించారు. రాష్ట్రంలో రోజూ జరుగుతున్న అఘాయిత్యాలపై మాట్లాడాలంటే తమకే సిగ్గనిపిస్తోందని వంగలపూడి అనిత విమర్శించారు. చిన్న బిడ్డలపై అత్యాచారం జరిగితే మంత్రి స్థాయిలో ఉన్న అంబటి రాంబాబు తన కార్యాలయంలో సెటిల్‌మెంట్‌లు చేస్తున్నారని వంగలపూడి అనిత దుయ్య బట్టారు. సీఎం పరదాలు దాటుకుని జనంలోకి వస్తే ఆడబిడ్డల సమస్యలు తెలుస్తాయని వంగలపూడి అనిత తెలిపారు.


మొత్తానికి టీడీపీ మహిళ అధ్యక్షురాలు వంగలపూడి అనిత.. మాత్రం చాలా యాక్టివ్‌గా ఉంటున్నారు. ఎప్పటి కప్పుడు ప్రభుత్వం తీరును ఎండగడుతున్నారు. రాజకీయంగా వచ్చిన అవకాశాలను వినియోగించుకుంటున్నారు. గతంలో పార్టీ నుంచి మంత్రి పదవులు పొందిన మహిళానేతలెందరో ఇప్పుడు కనీసం కనిపించడం లేదు. అనిత మాత్రం తరచూ ఏదో ఒక కార్యక్రమం నిర్విహిస్తూ పార్టీ కోసం శక్తి మేరకు కష్టపడుతున్నారు.


మరింత సమాచారం తెలుసుకోండి: