
ఒక టైం లో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం తెలుగుదేశం అయితే దానికి ప్రత్యామ్నయ పార్టీ గా భారతీయ జనతా పార్టీ ఉంటుందనుకున్నారు.. కానీ అది మూడో ప్రత్యామ్నాయ పార్టీగా అవతరించలేకపోయింది. 2009లో ఈ మూడవ ప్రత్యామ్నాయం కోసం చిరంజీవి ప్రజారాజ్యం పెట్టి దానిని ఎంతోకాలం కొనసాగించలేక, నమ్ముకున్న వాళ్ళ ఆశలు అడియాసలు చేస్తూ ప్రజారాజ్యం పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో అది కూడా మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా ఎదగలేక పోయింది.
ఆ తర్వాత ఆ అన్నగారి తమ్ముడు పవన్ కళ్యాణ్ 2014లో జనసేన పార్టీని పెట్టడంతో అది మూడవ ప్రత్యామ్నాయ శక్తిగా అవతరిస్తుందని అందరూ అనుకున్నారు. కానీ ఆ తర్వాత జనసేన పార్టీ తెలుగుదేశంతో పొత్తు పెట్టుకోవడం వల్ల, తృతీయ ప్రత్యామ్నాయ పార్టీగా అవతరిస్తుందనుకున్న జనసేన పక్కకు వెళ్ళిపోయింది. ఆ తర్వాత 2019లో కమ్యూనిస్టులు, బీఎస్పీతో పవన్ కళ్యాణ్ కలిసి వెళ్తే, తెలుగుదేశం ఇంకా భారతీయ జనతా పార్టీ మాత్రం ఒంటరిగా వెళ్లాయి.
అప్పుడు తెలుగుదేశం ప్రతిపక్షానికి పరిమితమైతే, జనసేన ఆరు శాతానికి పరిమితమైంది. భారతీయ జనతా పార్టీ 0.8%కి పరిమితమైంది. ఇప్పుడు వైయస్సార్సీపి పార్టీలో తీవ్ర అసంతృప్తితో ఉన్నవాళ్లు చాలామంది ఉన్నారని తెలుస్తుంది. వాళ్లు ఇటు తెలుగుదేశంలోకి వచ్చినా వాళ్లలో కొంతమందికి మాత్రమే టికెట్స్ ఇవ్వగలుగుతారు. చరిష్మా ఉన్న పవన్ కళ్యాణ్ ఇవన్నీ చూశాక కూడా తనకు వచ్చిన అవకాశాన్ని ఇంకెవరికి ఇవ్వకుండా సరిగ్గా ఉపయోగించుకోవాలి.