ఏ రాజకీయ  పార్టీకి అయినా.. నాయకుడికి అయినా అధికారమే పరమావధి. దీని కోసం అనేక ప్రయత్నాలు చేస్తుంటారు. కొంతమంది పార్టీలు స్థాపించి రాజకీయ రంగ ప్రవేశ చేస్తారు. మరికొంత మంది జాతీయ పార్టీల ద్వారా తమ ప్రభావాన్ని చాటాలని చూస్తుంటారు. అయితే ప్రాంతీయ పార్టీల అధినేతలే ఆ పార్టీకి ముఖ్యమంత్రి అభ్యర్థి.  ఉదా బీఆర్ఎస్ కు కేసీఆర్, టీడీపీకి చంద్రబాబు, వైసీపీకి జగన్ మోహన్ రెడ్డి, డీఎంకేకి స్టాలిన్, తృణమూల్ కాంగ్రెస్ కి మమతా బెనర్జీ ఇలా వాళ్లే అవుతుంటారు. వాళ్లు కాకపోతే వాళ్ల వారసులు సీఎం లు అవుతుంటారు.


జాతీయ పార్టీల విషయానికొస్తే ముఖ్యమంత్రి ఎవరు అవుతారో చెప్పలేం. తెలంగాణలో కాంగ్రెస్ గెలిస్తే రేవంత్ రెడ్డే సీఎం అవుతారని కచ్చితంగా చెప్పలేం. మరోవైపు బీజేపీ అధికారంలోకి వస్తే బీసీ అభ్యర్థే సీఎ అవుతారు అని చెప్పారు కానీ పేరు ప్రకటించలేదు. ఆ సమయానికి రాజకీయ పరిస్థితులు, కులాలు, సామాజిక వర్గాల ఆధారంగా జాతీయ పార్టీలు సీఎంలను ఎంపిక చేస్తుంటారు.


తెలంగాణ కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి దూకుడుగా వ్యవహరిస్తూ పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఒకవేళ పార్టీ గెలిస్తే అతనే సీఎం పదవి చేపడతారా అంటే సందేహమే. ఇప్పటికే ఆ పార్టీలో 10మంది సీఎం అభ్యర్థులు ఉన్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ టీవీలకు, సామాజిక మాధ్యమాలకు ప్రకటన వీడియోలు విడుదల చేశారు.


అందులో వీడియో అయిపోయాక రేవంత్ రెడ్డి తో పాటు భట్టి విక్రమార్క కూడా ఉన్నారు. అంటే జాతీయ పార్టీల ఆలోచనలు సామాజిక సమ తూకాలతో ఉంటుంది. ఇద్దరికీ సీఎం అవకాశాలు ఉంటాయని చెప్పకనే చెప్పింది. పార్టీ అధికారికంగా దీనికి ఓకే చెప్పిందంటే దీని వెనుక ఉద్దేశం అదే అని చెప్పవచ్చు. మరోవైపు కేసీఆర్ దళితుడ్ని సీఎం చేస్తానని మాట తప్పాడు కాబట్టి భట్టిని సీఎం చేసి దక్షిణాదిన ఉన్న దళిత ఓటర్లందర్నీ ఆకర్షించవచ్చు అనే ఆలోచనలో కూడా ఉండొచ్చు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాబట్టి రేవంత్ రెడ్డికి ఇది ఒక పరీక్ష.

మరింత సమాచారం తెలుసుకోండి: